దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: సిఎం కేసీఆర్‌

సోమవారం ఉదయం సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళిత నేతలతో సమావేశం నిర్వహించి దళిత బంధు పధకం గురించి వివరించారు. “దళిత బంధు పధకం మిగిలినవాటిలా ఓ కార్యక్రమం కాదు. ఇదొక మహా ఉద్యమం. రాష్ట్రంలో దళితులకు సామాజిక, ఆర్ధిక రంగాలలో మిగిలిన వర్గాల ప్రజలతో సమానంగా ఎదిగేందుకు రూపొందించబడిన పధకం ఇది. దీనిని హుజూరాబాద్‌లో పాలిత ప్రాజెక్టుగా చేపడుతున్నాము కనుక అక్కడ దీని విజయంపైనే ఈ పధకం భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. కనుక మీరందరూ కలిసికట్టుగా ఈ పధకాన్ని విజయవంతం చేయాలి. 

ఈ పధకం ద్వారా దళితులకు ఆర్ధికంగా సాయం అందించడమే కాకుండా వారితో కలిపి ప్రభుత్వ భాగస్వామ్యంలో శాస్విత ప్రాతిపదికన ఓ రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తాము. దీనిలో ఏటా ప్రభుత్వం తరపున కొంత సొమ్ము జమా చేస్తుంటాము. ఈ నిధి ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్దిదారులే నిర్వహించేవిదంగా ఈ పధకాన్ని రూపొందిస్తున్నాము. దళిత బంధు పధకానికి ఎంపికైనవారు ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో వ్యాపారాలలో నిలద్రొక్కుకొనేందుకు వీలుగా ఆర్ధికాభివృద్ధికి వీలున్న వివిద వ్యాపారాలలో రిజర్వేషన్లు కూడా కల్పిస్తాము. 

దేశంలో తొలిసారిగా తెలంగాణలో ప్రారంభం అవుతున్న ఈ పధకం విజయవంతమై యావత్ దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకొంటున్నాను. ఇది అందరి సమిష్టికృషి, పట్టుదలతోనే సాధ్యం. కనుక మీలో ప్రతీ ఒక్కరూ ఈ పధకం విజయవంతం చేయడానికి గట్టిగా కృషి చేయాలని కోరుకొంటున్నాను,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.