టిఆర్ఎస్‌ ఎంపీకి ఆరు నెలల జైలుశిక్ష.. జరిమానా!

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలుశిక్ష రూ.10,000 జరిమానా విధించింది ప్రజాప్రతినిధుల న్యాయస్థానం. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆమె ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచారని బూర్గంపాడు పహాడ్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫిర్యాదు దాఖలైంది. దానిపై విచారణ చేస్తున్న ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆమేను దోషిగా నిర్ధారించి ఆమెకు ఆరు నెలల జైలుశిక్ష, జరిమానా విధించింది. ఆమె పదివేలు జరిమానా చెల్లించి సొంత పూచీకత్తుపై బెయిల్‌ పొందారు. ఈ కేసుపై ఆమె హైకోర్టును ఆశ్రయించబోతున్నాట్లు తెలుస్తోంది. 

ఎన్నికలలో డబ్బు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పంచని రాజకీయనాయకుడు దేశంలో లేడంటే అతిశయోక్తి కాదు. ఈవిషయం ప్రభుత్వాలకు, ఎన్నికల కమీషన్లకు, పోలీసులకు, చివరికి న్యాయస్థానాలకు అందరికీ తెలుసు. కానీ అంతా సవ్యంగానే సాగుతోందని... ఎన్నికలలో అక్రమాలకు పాల్పడితే సహించబోమనే చిలకపలుకులు వినిపిస్తుంటాయి. కనుక ఇంతవరకు ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీలను అడ్డుకొనేవారే లేరని చెప్పొచ్చు. అందుకే దేశంలో ఎప్పుడు...ఎక్కడ..ఏ ఎన్నికలు జరిగిన మద్యం ఏరులై పారుతుంటుంది. లక్షలు, కోట్లు డబ్బు చేతులు మారుతుంటుంది. ఒకటీ ఆరా ఇటువంటి కేసులు నమోదైన చివరికి అవి ఏవిదంగా ముగుస్తాయో అందరికీ తెలుసు.