నేడు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వందమంది వికలాంగులకు మూడు చక్రాల స్కూటీలను విరాళంగా అందజేశారు. కేటీఆర్ స్వయంగా స్కూటీలు ఇవ్వడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలో నేతలు అందరూ కూడా ముందుకువచ్చి సమాజంలో పేదవారికి, నిసహాయులకు సాయం చేయాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తన పుట్టిన రోజున ఎవరూ పూల బొకేలు, కేకులు, కటవుట్ల కోసం డబ్బు వృధా చేయవద్దని ముక్కోటి వృక్షార్చనలో అందరూ తలో ఒక్క మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందిస్తూ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో దివ్యాంగులకు 50 మూడు చక్రాల స్కూటీలను విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ 50, గువ్వల బాలరాజు, గాదరి కిషోర్ రెడ్డి చెరో 20 స్కూటీలను ఇస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ 100, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంభీపూర్ రాజు చెరో 60 వాహనాలను విరాళంగా అందజేస్తామని ప్రకటించారు.
మంత్రి కేటీఆర్ గత ఏడాది తన పుట్టినరోజునాడు ప్రభుత్వాసుపత్రులకు ఆరు అంబులెన్సులు విరాళంగా అందజేసి ఇదేవిదంగా పార్టీ నేతలకు పిలుపునీయగా అందరూ కలిసి 100 అంబులెన్సులను విరాళంగా అందజేశారు.