
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్దీకరణ (ఎల్ఆర్ఎస్) కోసం జూలై 20వ తేదీన ఓ మెమో జారీ చేసింది. దీంతో ఎల్ఆర్ఎస్ కొరకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని, రెండు వారాలలోగా వాటిని ఆమోదించబోతోందంటూ మీడియాలో వస్తున్న వస్తున్న వార్తలపై ప్రభుత్వం గురువారం స్పందించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు పరిశీలనలో ఉన్నందున ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలిస్తున్నామే తప్ప ఆమోదం తెలుపడం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని స్పష్టం చేసింది. అయితే ఎల్ఆర్ఎస్పై హైకోర్టు తుది తీర్పు వెలువడితే అప్పుడైనా తగిన చర్యలు చేపట్టవలసి ఉంటుంది గనుక ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని మాత్రమే ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అందుతున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించవలసిందిగా రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది.