లోక్‌సభ స్పీకరుకు ఫిర్యాదు చేస్తా: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి లోక్‌సభ స్పీకరు ఓం బిర్లాకు తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. వాటికి తాను హాజరుకాకుండా పోలీసులు తనను గృహ నిర్బందంలో ఉంచారని రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

దీనిపై బంజారా హిల్స్ ఏసీపీ ఎం సుదర్శన్ స్పందిస్తూ రేవంత్‌ రెడ్డికి ఓ లేఖ వ్రాశారు. రేవంత్‌ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండా తాము అడ్డుకోవట్లేదని, కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా చేయడానికి అనుమతి లేని కారణంగానే గృహనిర్బందంలో ఉంచవలసి వచ్చిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ రేవంత్‌ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాలనుకొంటే తాము అడ్డుకోబోమని లేఖ ద్వారా తెలియజేశారు. 

కోకాపేట భూముల వేలంపాటలో రూ.1,000 కోట్లు అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. అందుకు నిరసనగా నేడు అక్కడ ధర్నా చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సిద్దమవడంతో పోలీసులు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. 

కోకాపేట భూముల వేలంపాటలో రూ.1,000 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్‌ రెడ్డి, ఈ విషయాన్ని కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని, లోక్‌సభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ అవినీతి గురించి నిలదీస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తోందని, ఈ విషయాన్ని కూడా లోక్‌సభ స్పీకరుకు ఫిర్యాదు చేస్తానని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.