12.jpg)
రాష్ట్రంలో దళిత ప్రజల కోసం సిఎం కేసీఆర్ కొత్తగా ప్రవేశ పెట్టిన పధకానికి ‘దళిత బంధు’ అని పేరు పెట్టారు. ఈ పధకాన్ని పైలట్ ప్రాజెక్టుగా మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో సిఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారు. దీనిని ఈ ఒక్క నియోజకవర్గంలో అమలుచేయడం కోసం ప్రభుత్వం తొలి విడతలో రూ.1,500-2,000 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఈ పధకంలో అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్ధికసాయం అందజేస్తుంది. ప్రభుత్వం ఈ డబ్బును నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలోనే జమా చేస్తుంది. దాంతో వారు తమకు నచ్చిన వ్యాపారం, వృత్తి ఏదైనా చేసుకోవచ్చు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 100 గ్రామాలు వాటిలో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో గ్రామానికి ఒక్కో ఐఏఎస్ అధికారి చొప్పున 100 మందికి ఈ దళిత బంధు పధకం అమలు బాధ్యత అప్పగిస్తారు. వారు ఆర్ధిక సాయం పొందిన దళిత కుటుంబాలకు వ్యాపారం లేదా వృత్తిని ప్రారంభించేందుకు అవసరమైన సహాయసహకారాలు, మార్గదర్శనం చేస్తుంటారు.
హుజూరాబాద్ మండలంలో 5,323, కమలాపూర్‌లో 4,346, వీణవంకలో 3,678, జమ్మికుంటలో 4,996, ఇల్లంతకుంటలో 2,586 దళిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో అర్హులను గుర్తించి వారికి దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో భాగంగా తలో రూ.10 లక్షల ఆర్ధికసాయం అందజేస్తారు.
సిఎం కేసీఆర్ ఏ కార్యక్రమమైనా, పధకాన్నైనా కరీంనగర్ జిల్లాలోనే ప్రారంభించడం సెంటిమెంటుగా వస్తోంది కనుకనే దళిత బంధు పధకాన్ని కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభిస్తారని సీఎంఓ తెలిపింది. ఈ పధకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలుచేసి దానిలో సాధకబాధకాలు తెలుసుకొని ఏవైనా లోపాలు, లోటుపాట్లు ఉన్నట్లయితే సవరించుకోవచ్చుననే ఉద్దేశ్యం కూడా ఉందని తెలిపింది.