తెలంగాణ నీటి వాటా కోసం పోరాటానికి సిద్దం: కేసీఆర్‌

కృష్ణా, గోదావరి నదులపై సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని సిఎం కేసీఆర్‌ తప్పు పట్టారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతుండటంతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ అంశంపై పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సిఎం కేసీఆర్‌ టిఆర్ఎస్‌ ఎంపీలకు సూచించారు. కృష్ణ జలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వంతో నెలకొన్న వివాదాల పరిష్కారానికి ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని, అక్కడే తమ వాదనలు వినిపిస్తామని సిఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించడం తమకు సమ్మతం కాదని, ఎట్టి పరిస్థితులలో ఈ ప్రతిపాదనను అంగీకరించబోమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటివాటాను ఎట్టి పరిస్థితులలో వదులుకోబోమని సిఎం కేసీఆర్‌ అన్నారు. దీని కోసం అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్దమని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా విభజన హామీల అమలు గురించి కూడా పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని సిఎం కేసీఆర్‌ ఎంపీలకు సూచించారు. ఇవి కాక రాష్ట్రానికి సంబందించిన పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై సిఎం కేసీఆర్‌ ఎంపీలకు మార్గదర్శనం చేశారు.   

ఈ సమావేశంలో టిఆర్ఎస్‌ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్‌సభ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, మంత్రి గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.