చేనేత కార్మికుల బతుకులు కూడా మారుతాయి: కేసీఆర్‌

తెలంగాణ టిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ శుక్రవారం సిఎం కేసీఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “రాష్ట్రంలో చేనేత వర్గానికి కూడా రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తున్నాము. అలాగే చేనేత, మర మగ్గం కార్మికుల సమస్యల పరిష్కరించి వారి జీవితాలలో మళ్ళీ వెలుగులు నింపడానికి చాలా చర్యలు చేపడుతున్నాము. ఒకప్పుడు నేను సిరిసిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ గోడల మీద ‘చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి. చావు సమస్యలకు పరిష్కారం కాదు..’అనే రాతలు చూసి చాలా బాధపడేవాడిని. అప్పటి నుంచే వారి జీవితాలకు ఓ దారి చూపాలని గట్టిగా నిశ్చయించుకొని తదనుగుణంగా అనేక చర్యలు చేపట్టాము. దానిలో భాగంగానే వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాము. దానిలో అనేక చిన్నా పెద్ద బట్టల మిల్లులు రాబోతున్నాయి. అవొస్తే రాష్ట్రంలో నేత కార్మికులందరికీ పని దొరుకుతుంది. అలాగే సూరత్‌ బట్టల మిల్లులలో పనిచేస్తున్న మన కార్మికులందరూ కూడా వెనక్కు తిరిగివస్తారు. రైతు భీమాలాగే త్వరలోనే చేనేత కార్మికులకు కూడా భీమా కల్పిస్తాం.” అని అన్నారు. 

తన లక్ష్యం గురించి మాట్లాడుతూ, “తెలంగాణ ఓ బంగారు తునక. ఇక్కడ దేనికీ కరువు లేదు కానీ దశాబ్ధాలుగా పరాయిపాలనలో నిర్లక్ష్యానికి గురవడం వలన వెనకబడిపోయాము. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకొని వాటిని నిఖచ్చిగా అమలుచేస్తున్నాము. అందుకే రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పులు కనబడుతున్నాయి. విద్యా, వైద్య, విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు...ఇలా ఏ రంగంలో చూసుకొన్నా చాలా మార్పు కనబడుతోంది. అలాగే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నాము. దేశంలో ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి, ఇన్ని సంక్షేమ పధకాలు మరే రాష్ట్రంలో కూడా జరుగలేదు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సాధించవలసింది ఇంకా చాలా ఉంది. నాకు ఏ ఆశలు, కోరికలు లేవు. నా లక్ష్యం ఒకటే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను కలలు కన్న బంగారి తెలంగాణ సాధించే వరకు శ్రమిస్తాను. నా ఈ లక్ష్యం నుంచి నన్ను ఎవరూ మళ్ళించలేరు,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.