ఆనాడు రావణాసురుడి తలలని నరికిన కొద్దీ పుట్టుకొచ్చినట్లే, ఈనాడు నయీం కేసులని దర్యాప్తు చేస్తున్నకొద్దీ ఇంకా ఇంకా అనేక నేరాలు, బాధితులు, అతనితో సంబంధాలున్న అనేకమంది రాజకీయ నేతలు, పోలీసుల పేర్లు బయటకి వస్తూనే ఉన్నాయి. నయీం కేసుల దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకి ఇంతవరకు 400 పిర్యాదులు అందాయి. ఇంకా అందుతూనే ఉన్నాయి. వాటి ఆధారంగా వారు 126 కేసులు నమోదు చేశారు. మొత్తం 93మందిని అరెస్ట్ చేశారు. వారిలో 35మంది నయీం కుటుంబ సభ్యులు, ముఠాకి చెందినవారే. కేసులన్నిటిపై సమగ్రంగా దర్యాప్తు జరిపితే అన్ని రాజకీయ పార్టీలలో నేతలు, ప్రజాప్రతినిధులు, అనేకమంది పోలీస్ అధికారులు కటకటాలు లెక్కపెట్టవలసి ఉంటుంది. అందుకే తెరాస సర్కార్ ఈ కేసులని సిబిఐకి అప్పగించడం లేదని సిపిఐ నేత కె. నారాయణ వాదిస్తున్నారు. దానికోసం ఆయన నిన్న హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి కూడా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. కనుక నేడోరేపో సాధారణ ప్రజాహిత పిటిషన్ వేసే అవకాశం ఉంది.
భువనగిరికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ తనకి న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కి వ్రాసిన లేఖలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పిర్యాదు చేయడం ఈ కేసులో తాజా పరిణామంగా చెప్పుకోవచ్చు. అతను, నయీం అనుచరులతో కలిసి జిల్లెలగూడా గ్రామా పంచాయితీలో ఉన్న తన భూమిని కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. నయీం బ్రతికుండగా తాను చాలాసార్లు పోలీసులకి పిర్యాదులు చేసినా వాటిని వారు పట్టించుకోలేదని ఆమె తన లేఖలో ఆరోపించారు.
రోజురోజుకి పెరుగుతున్న ఈ కేసులు, పిర్యాదులు, భాదితులు, అరెస్టులు చూస్తుంటే తెరాస సర్కార్ హయంలో శాంతిభద్రతల డొల్లతనం బయటపడుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన మంత్రులు ఎంతసేపు ఇదివరకు ఎవరూ ఎన్నడూ చేయలేని పనులన్నీ చేసేస్తున్నామని తమ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకోవడమే కనిపిస్తోంది తప్ప రాష్ట్రంలో ఇన్ని వందలమంది సామాన్య ప్రజలు నయీం ముఠా, రాజకీయ నేతలు, పోలీసుల చేతిలో నలిగిపోతున్న సంగతి పట్టించుకోకపోవడం చాలా విస్మయం కలిగిస్తుంది. నయీం అక్రమాలు, అకృత్యాలు తెదేపా, కాంగ్రెస్ హయం నుంచే సాగుతున్నాయంటే ఎన్ని వేలమంది ప్రజలు ఎన్ని బాధలుపడి ఉంటారో, బలైపోయుంటారో ఎవరూ ఊహించలేరు.
అప్పటి ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వహించారు సరే..కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మన ‘ఇంటి పార్టీ’యే అధికారంలోకి వచ్చిన తరువాత నయీం ముఠా అక్రుత్యాలని ఇంతకాలం ఎందుకు అరికట్టలేకపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదనుకోవాలా లేక తెలిసీ తెలియనట్లు వ్యవహరించిందనుకోవాలా? ఇంత కాలం నయీం ఆగడాలని చూసి చూడనట్లు ఊరుకొన్న ప్రభుత్వం ఇప్పుడు నయీంని ఎందుకు ఎన్కౌంటర్ చేసింది? కారణం ఏమిటి? అని అనేక సందేహాలు కలుగుతున్నాయి.
ఒక్క నయీం విషయంలోనే కాదు హైదరాబాద్ నగరం నడిబొడ్డున మకాం వేసిన ఐసిస్ మద్దతుదారులు బారీగా ఆయుధాలు, ప్రేలుడు పదార్ధాలతో పట్టుబడుతుండటం గమనిస్తే నగరప్రజలు అమాయకంగా ల్యాండ్ మైన్ పై కూర్చొన్న భావన కలుగక మానదు. పోలీసులు తరచూ కార్బన్ సర్చ్ నిర్వహిస్తున్నా, డ్రంక్-అండ్-డ్రైవ్ నిర్వహిస్తున్నా నగరంలో ఉగ్రవాదుల మద్దతుదారులు, మాదకద్రవ్యాల ముఠాలు పట్టుబడుతూనే ఉండటం చాలా ఆందోళన కలిగిస్తోంది. వాటికి తోడూ రాష్ట్రంలో నయీం వంటి ముఠాలు ఇంకా ఎన్ని ఉన్నాయో, వాటికి ఇంకా ఎంతమంది ప్రజలు బలైపోతున్నారో..తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా రోదిస్తున్నారో ఎవరికీ తెలియదు.
కనుక గత ప్రభుత్వాలకి తమ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రజలు కూడా గుర్తించేలాగ తెరాస సర్కార్ పాలన సాగించవలసి ఉంటుంది. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో మరింత కటినంగా వ్యవహరించడం చాలా అవసరం అని నయీం కేసులతో అర్ధం అవుతోంది. ఒక సాధారణ మహిళ తనకి న్యాయం చేయమని కోరుతూ పోలీసులని ఆశ్రయించినా ఫలితం లేక ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడం ఆయనకి, ప్రభుత్వానికి కూడా ఏమీ గౌరవం కాదని గ్రహించాలి.