బుదవారం సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం.. వ్యవసాయోత్పత్తులు పెరిగినందున రాష్ట్రవ్యాప్తంగా పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, కంపెనీల ఏర్పాటుకు సంబందించి విధివిధానాలు, ప్రోత్సాహాకలపై లోతుగా చర్చించి వాటికీ ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలు:
• తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి ఆమోదముద్ర.
• గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా మొదటిదశలో రాబోయే రెండేళ్ళలో రూ.25,000 కోట్లు పెట్టుబడితో పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు.
• వాటి కోసం మొత్తం 10,000 ఎకరాలు కేటాయింపు. ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కనీసం 500-1,000 ఎకరాలలోపు సకల మౌలిక సదుపాయాలతో ఏర్పాటు.
• ఈ పాలసీలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో కంపెనీలు ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి (టర్మ్ లోన్) కోసం తీసుకొన్న రుణంపై చెల్లించాల్సిన వడ్డీలో 75 శాతం లేదా రెండు కోట్లకు మించకుండా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చెల్లిస్తుంది.
• ఆ పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై ప్రతీ యూనిట్‌కు రూ.2 చొప్పున ఐదేళ్ళపాటు ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంది.
• ఏడేళ్ళ వరకు మార్కెట్ కమిటీ ఫీజుపై 100 శాతం రీయింబర్స్మెంట్.
• ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైసు మిల్లులు, బియ్యం, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పువ్వులు తదితర ఉత్పత్తులు, పాలతో డైయిరీ ఉత్పత్తులు, కోళ్ళు, చేపలు, మాంసం తదితర ఉత్పత్తులకు సంబందించిన పరిశ్రమలను ఏర్పాటు చేయబడతాయి.
• ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు 500 మీటర్ల పరిధిలో జనావాసాలకు, ఎటువంటి నిర్మాణాలకు అనుమతించబడవు.
• ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మూలధనంలో (రూ.20 లక్షలు మించకుండా) 15% వరకు రాయితీ. దానిపై చెల్లించాల్సిన వడ్డీలో 85% (రూ.2 కోట్లు మించకుండా) రాయితీ.
• అర్హులైనవారికి కేటాయించిన భూమి ధరలో (రూ.20 లక్షలకు మించకుండా) 33% రాయితీ.
• కోటి రూపాయలకు మించకుండా 15% మూలధనం మంజూరు.
• , గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా వారికి ప్రభుత్వమే షెడ్లు నిర్మించి ఇస్తుంది.
• ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వాటిలో పరిశ్రమలు ఏర్పాటుతో పాటు ఉత్పత్తిదారులు, స్వయం సహాయ సంఘాలు, రైతు సంఘాలు, ఎఫ్‌పీవోలకు ఆర్ధిక ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.
• ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో పరిశ్రమలు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 31 వరకు గడువు.