కాంగ్రెస్‌లోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి

టిఆర్ఎస్‌ ప్రభుత్వంతో పోరాడటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే కారణంతో నాగార్జునసాగర్ ఉపఎన్నికల తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్ళీ పార్టీలో కొనసాగేందుకు అంగీకరించారు.   పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మొన్న ఆయన ఇంటికి వెళ్ళి పార్టీ పరిస్థితి, రాష్ట్ర రాజకీయాల గురించి సుదీర్గంగా చర్చించిన తరువాత కేసీఆర్‌పై పోరులో తనతో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎల్లప్పుడూ తెలంగాణ రాష్ట్రం.. ప్రజల కోసం పరితపిస్తుంటారు. సిఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పటికీ ఏమీ చేయలేకపోతున్నామనే ఆవేదనతో పార్టీకి దూరంగా ఉంటున్నారు తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. పార్టీలో అందరం కలిసికట్టుగా టిఆర్ఎస్‌పై పోరాడుదామనే నా విజ్ఞప్తిని మన్నించి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.