కొత్తగూడెం ప్రజలకి గొప్ప శుభవార్త

ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రజలకి ఒక గొప్ప శుభవార్త. కేంద్ర పౌర విమానయానశాఖ కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి సోమవారం ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం డిల్లీలో సమావేశమైన కేంద్ర పౌర విమానయానశాఖ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనకి ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసిన ప్రాంతంలోనే కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాన్ని నిర్మించి ఇస్తుంది. 

 తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కాగా మరొకటి వరంగల్ విమానాశ్రయం. మూడవదైన బేగంపేట్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వాయుసేన అవసరాలకి, ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వంటి ప్రముఖుల రాకపోకలకి మాత్రమే పరిమితం చేయడంతో దానిని ఇప్పుడు లెక్కలోకి తీసుకోలేము. కనుక కొత్తగూడెంలో ఏర్పాటు చేయబోతున్న ఈ విమానాశ్రయంతో కలిపి రాష్ట్రంలో మళ్ళీ మూడు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలోగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తయి, విమానసేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా మూడు విమానాశ్రయాల ఏర్పాటుకి ఆమోదముద్ర తెలిపింది. వాటిలో ఒకటి విజయవాడ జిల్లాలో భోగాపురం వద్ద, మరొకటి నెల్లూరులోని దగదర్తి వద్ద, మూడవది కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు లో ఏర్పాటు చేయబోతోంది. వాటిలో భోగాపురం వద్ద నిర్మించబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, దగదర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించబోతున్నారు. కర్నూలులో మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వనే తన స్వంత నిధులతో నిర్మిస్తుంది.