
హుజూరాబాద్ ఉపఎన్నికలలో ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టాలనే అంశంపై చాలా గోప్యత పాటిస్తున్న టిఆర్ఎస్కు కౌశిక్ రెడ్డి వలన పెద్ద షాక్ తగిలింది. ఆయన అత్యుత్సాహంతో ‘టిఆర్ఎస్ టికెట్ నాకే ఖరారు అయ్యింది...యూత్‌కు పంచేందుకు డబ్బు కట్టలు కూడా సిద్దంగా ఉన్నాయంటూ...‘కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే ఓ కార్యకర్తకు ఫోన్ చేసి చెప్పడం, ఆ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అవడంతో టిఆర్ఎస్ కంగు తింది.
కౌశిక్ రెడ్డి వెంటనే వాటిని పుకార్లని చెప్పి ఖండించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ తన ఫోన్ సంభాషణ వైరల్ అవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తద్వారా అవి నిజమని స్వయంగా దృవీకరించినట్లయింది. అంతేకాదు... కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదన్నపేట గ్రామ సర్పంచ్ చరణ్ అనుచరులందరికీ డబ్బు, మద్యం పంచి పెట్టి మనవైపు తిప్పుకోవాలంటూ కౌశిక్ రెడ్డి ఫోన్లో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రతిపక్షపార్టీలలో నేతలను, కార్యకర్తలను టిఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేసి ఆకర్షిస్తోందనే వాదనలకు బలం చేకూరినట్లయింది. కౌశిక్ రెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకే కాక టిఆర్ఎస్ పార్టీకి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది.
కౌశిక్ రెడ్డి శుక్రవారం టిఆర్ఎస్లో చేరేందుకు సిద్దం అయ్యారు. కానీ తాజా పరిణమాల నేపధ్యంలో ఆయనను పార్టీలో చేర్చుకొంటే, టిఆర్ఎస్పై వస్తున్న ఈ ఆరోపణలను అంగీకరించినట్లవుతుంది కనుక ఆయన చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తెలంగాణ భవన్లో జిల్లా మంత్రులు, నేతలతో సమావేశమయ్యి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో పార్టీకి జరిగిన నష్టం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇక కౌశిక్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కూడా ఆయనను బహిష్కరించింది. కనుక కాంగ్రెస్ గూటికి తిరిగి వెళ్ళలేరు. తాజా పరిణమాల నేపధ్యంలో ఆయనను టిఆర్ఎస్లో చేర్చుకొనే అవకాశం లేదు. మొన్నటి వరకు హుజూరాబాద్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధిననే ధీమాతో ఉన్న కౌశిక్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇది స్వయంకృతాపరాధమే అని అర్ధమవుతోంది.