వరంగల్‌ జిల్లాల పేర్లు మార్పుకు నోటిఫికేషన్‌ జారీ

సిఎం కేసీఆర్‌ గత నెల్లో వరంగల్‌లో పర్యటించినప్పుడు ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యర్ధన మేరకు వరంగల్‌ రూరల్, అర్బన్ జిల్లాల పేర్లను వరంగల్‌, హన్మకొండ జిల్లాలుగా మార్చుతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం హన్మకొండ జిల్లాలో హన్మకొండ, పరకల్ రెవెన్యూ డివిజన్లు, 12 మండలాలు ఉంటాయి. హన్మకొండకు వరంగల్‌ పశ్చిమ జిల్లా కేంద్రంగా ఉంటుంది. జిల్లాల పేర్లు మార్పుపై ప్రజలు, రాజకీయ పార్టీలు ఎవరైనా అభ్యంతరాలు, అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏవైనా ఇచ్చేందుకు వీలుగా ఈ నోటిఫికేషన్‌ను తెలుగు, ఇంగ్లీషు బాషల్లో ప్రచురించాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఎటువంటి అభ్యంతరాలు లేనట్లయితే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి, శాసనసభ సమావేశాలలో దీనికి సంబందించి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేస్తుంది. అయితే ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యర్ధన మేరకే జిల్లాల పేర్లు మార్చుతున్నందున మిగిలిన ప్రక్రియ అంతా లాంఛనప్రాయమే అని భావించవచ్చు.