18.jpg)
హుజూరాబాద్ ఉపఎన్నికలలో తెలంగాణ జనసమితి (టిజేఎస్) కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టిజేఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఎప్పుడు ఎన్నికలొచ్చినా కొందరు మా పార్టీపై పనిగట్టుకొని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇదివరకు మా పార్టీ బిజెపికి దగ్గరవుతోందని ప్రచారం చేశారు. ఇప్పుడు మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొలేనివారే మాపై ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ పుకార్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ జనసమితిని ఏ పార్టీలో విలీనం చేయడం లేదు. మా పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. హుజూరాబాద్ ఉపఎన్నికలలో కూడా పోటీ చేస్తుంది,” అని చెప్పారు.
నిరుద్యోగం, పోడు రైతుల సమస్యలు, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తదితర సమస్యలపై తెలంగాణ జనసమితి పోరాడుతుందని అన్నారు. ఆగస్ట్ నెలాఖరులో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.
ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు సిఎం కేసీఆర్ 50,000 ఉద్యోగాల భర్తీ అనే పాత పాట పాడుతుంటారని, కానీ నోటిఫికేషన్లు మాత్రం జారీ అవవని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి కేటీఆర్ పదేపదే చెప్పుకోవడాన్ని కోదండరాం తప్పు పట్టారు. అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఏఏ శాఖల్లో ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఉంటే రాష్ట్రంలో నేటికీ నిరుద్యోగులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారని ప్రశ్నించారు. వారి ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని అన్నారు.