హమ్మయ్య! రజనీకాంత్ తేల్చేశారు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయాలలోకి వస్తారా లేదా? అనే సస్పెన్స్‌ దశాబ్ధాలుగా కొనసాగుతోంది. ఎట్టకేలకు ఇవాళ్ళ ఆయన దానికి తెరదించారు. ఇవాళ్ళ చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన అభిమానులతో సమావేశమయ్యారు. దీంతో ఆయన రాజకీయాలలో రాబోతున్నట్లు ప్రకటించడానికే ఆ సమావేశం ఏర్పాటు చేశారని అందరూ భావించారు. కానీ తాను రాజకీయాలలోకి రావడం లేదని స్పష్టం చేశారు. తన పార్టీకి పునాదిగా అభిమానులు ఏర్పాటు చేసుకొన్న మక్కళ్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాని స్థానంలో రజనీ అభిమాన మండ్రంను ఏర్పాటు చేస్తునట్లు ప్రకటించారు.

ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇంతకాలం నా సినిమా షూటింగులు, కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా నా రాజకీయ ప్రవేశం గురించి మీతో చర్చించలేకపోయాను. అందువల్ల సమాచారలోపం ఏర్పడి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నా రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చేందుకే ఇవాళ్ళ మీ ముందుకు వచ్చాను. భవిష్యత్‌లో కూడా నేను రాజకీయాలలోకి రావడం లేదు. కనుక ఇకపై ఎవరూ దీని గురించి మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.