
హుజూరాబాద్ ఉపఎన్నికలకు ముందే అధికార, ప్రతిపక్షాల మద్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్‌లపై ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికే తుపాకి రాముడని, ఈటల రాజేందర్ వెనుక తిరిగే బండి సంజయ్ తోక రాముడని, ఈటల రాజేందర్ ద్రోహి అని బాల్క సుమన్ అన్నారు. కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు పిసిసి అధ్యక్ష పదవి లభించగానే రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సిఎం కేసీఆర్‌ను చూసే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు అధ్యక్ష పదవులు ఇచ్చారని కనుక ఆ పదవులు మీకు సిఎం కేసీఆర్ పెట్టిన భిక్షే అని అన్నారు. కోళ్ళ ఫారాలు నడిపించుకొని బతుకుతున్న ఈటల రాజేందర్‌ను సిఎం కేసీఆర్ ఆదరించి, మంత్రి పదవులిచ్చి గౌరవిస్తే ఆయన తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దినట్లు ద్రోహానికి పాల్పడ్డారని, అయినా కూడా సిఎం కేసీఆర్ ఆయనను చాలా ఓపికగా భరించారని అన్నారు. కాంగ్రెస్, బిజెపిల వలన రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదని అందుకే ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడం లేదని బాల్క సుమన్ అన్నారు.