ఫ్లెక్సీలపై కాదు ప్రజల గుండెల్లో ఉన్నా: ఈటల

మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌ శుక్రవారం జమ్మికుంట మండలం నాగంపేట్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను మీలాగ (టిఆర్ఎస్‌ నేతల్లాగ) ఫ్లెక్సీ బ్యానర్లలో ఉండే బొమ్మను కాను. తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొన్నవాడిని. కనుక నన్ను ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఇదివరకు హుజూరాబాద్‌కు ఏ మంత్రి, ఎమ్మెల్యే ఎన్నడూ రాలేదు కానీ ఇప్పుడు ఉపఎన్నికలొస్తుండటంతో అందరూ ఇక్కడే తిష్టవేసి గల్లీల్లో తిరుగుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే హటాత్తుగా పింఛన్లు, రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నారో ప్రజలు ప్రజలకు తెలుసు. కారణం ఏదైనప్పటికీ నా వలన ప్రజలకు ఇవన్నీ లభిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. కానీ ఇటువంటివారి మాయమాటలు నమ్మి ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను  గెలిపిస్తే మళ్ళీ ఎన్నికల వరకు ఎవరూ కనబడరు.      

నేను పార్టీలో ఉండగానే 2018 శాసనసభ ఎన్నికలలో ఓడగొట్టడానికి సిఎం కేసీఆర్‌ ప్రయత్నించారు. ఆయనే నాకు పార్టీ టికెట్ ఇచ్చి ఆయనే నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నించడం కంటే నీచ రాజకీయం ఏమైనా ఉంటుందా?రైతు బంధు పధకం ధనికులు, భూస్వాములకు వర్తింపజేయడం సరికాదని చెపితే, నేను ఆ పధకాన్ని వ్యతిరేకిస్తున్నానని నాపై దుష్ప్రచారం చేయించారు. ఇంకా ఉద్యోగాల భర్తీ, పంటల కొనుగోలు తదితర అంశాలపై నా సలహాలు, సూచనలు నచ్చకనే పార్టీ వ్యతిరేకి ముద్ర వేసి బయటకు పంపించారు. అయితే నన్ను బయటకు పంపించినప్పటికీ నేను ప్రజల గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నారు,” అని ఈటల రాజేందర్‌ అన్నారు.