కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజనకోసం తెర ముందు వెనుక నడిచిన కధని వివరించడానికి ‘విభజన కధ’ అనే పుస్తకం వ్రాస్తే, దానిపై ఆయన, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వాదోపవాదాలు చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. దాని వలన అటు ఆంధ్రాకి కానీ ఇటు తెలంగాణాకి గానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయినా, ఆ పేరు చెప్పుకొని ఇద్దరు మాజీలు మళ్ళీ మీడియా ఫోకస్ లోకి రాగలిగారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ ఆ పుస్తకంలో వ్రాసిన అంశాలపై చర్చించేందుకు ‘బిగ్ డిబేట్’ అనే ఒక కార్యక్రమం నిర్వహించారు. దానిలో వారితో బాటు ప్రొఫెసర్ కోదండరాం, పొన్నం ప్రభాకర్, తెరాస ఎంపి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఆ చర్చలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ “ఆ సమయంలో కాంగ్రెస్, భాజపాలు రెండూ పరస్పరం చాలా అపనమ్మకంతో ఉన్నాయి. ఆ కారణంగా ఆ బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ మీరా కుమార్ వెనుకాడుతుంటే నేను చొరవ తీసుకొని అందరినీ ఒప్పించి హెడ్ కౌంట్ పద్ధతిలో బిల్లు ఆమోదం పొందేలా చేయగలిగాను. స్పీకర్ ఛాంబర్ లో ఏమి జరిగిందో, ఉండవల్లి, కెసిఆర్, పార్లమెంటులో సభ్యులకి గానీ చివరికి మా పార్టీలో చాలా మంది మంత్రులకి కూడా తెలియదు. మధ్యాహ్నం రెండు గంటలకి కెసిఆర్ సభకి వచ్చి కూర్చొని సభలో ఏమి జరుగబోతోందా అని అమాయకంగా చూస్తూ కూర్చొన్నారు. తెలంగాణా సాధన కోసం ఆయన చాలా గొప్పగా ఉద్యమాలు చేసిన మాట వాస్తవం కానీ బిల్లుని సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి తెర వెనుక ఏమి ప్రయత్నాలు జరుగుతున్నాయో కూడా అయనకి తెలియదు. బిల్లు ఆమోదంలో ఆయన పాత్ర ఏమీ లేదు. సభలో బిల్లు ప్రవేశపెట్టి హెడ్ కౌంట్ కోరినప్పుడు అందరితో బాటు ఆయన కూడా లేచి నిలబడ్డారు. అంతే! తెలంగాణా ఏర్పాటు చేసిన క్రెడిట్ సోనియా గాంధీకి మాత్రమే దక్కాలనే ఉద్దేశ్యంతోనే తెర వెనుక నేను చేసిన ప్రయత్నాల గురించి ఎన్నడూ చెప్పుకోలేదు. తెలంగాణా ఏర్పాటు కోసం నా బాధ్యతని నేను నిర్వర్తించాను అంతే,” అని జైపాల్ రెడ్డి చెప్పారు.
ఉండవల్లి యధాప్రకారం “ఆ రోజు సభలో బిల్లుని ఆమోదించడానికి తగినంత మంది సభ్యులు లేరు. సెక్షన్ 367 (3) ద్వారా హెడ్ కౌంట్ కూడా జరుపలేదు. కానీ బిల్లు ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించేశారు. నాదృష్టిలో నేటికీ ఆ బిల్లుకి పార్లమెంటు ఆమోదం లేదు,” అని వాదించారు.
ఈ చర్చలో పాల్గొన్న జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, “కేవలం నా వలననే బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది అని జైపాల్ రెడ్డి చెప్పుకోవడం తప్పు. అసలు సభలో బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించవలసిన అనివార్య పరిస్థితి కలగడానికి కారణం ఎవరు? కెసిఆరే కదా?ఆయన నేతృత్వంలో జరిగిన ఉద్యమాలతో కేంద్రప్రభుత్వానికి ఆ అనివార్య పరిస్థితి కల్పించారు. ఆయన అనేకమంది జాతీయపార్టీల నేతలతో మాట్లాడి బిల్లుకి మద్దతు సంపాదించారు. అయన చేసిన పోరాటాలని, ఈ కృషిని గుర్తించకుండా ఆయనని ఉద్దేశించి జైపాల్ రెడ్డి ఈవిధంగా చులకనగా మాట్లాడటం తగదు,” అని అన్నారు.
ఆ చర్చలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం నిష్పక్షపతంగా మాట్లాడారు. కాంగ్రెస్, భాజపాల సహాకారం, తెలంగాణా ఎంపిల కృషి, తెలంగాణా ఉద్యమాల కారణంగానే ఆరోజు బిల్లుకి ఆమోదం లభించిందని, అది సమిష్టి విజయం తప్ప ఏ ఒక్కరి విజయమో కాదని అన్నారు. జరిగిపోయిన చరిత్రను తవ్వుకొని వాదోపవాదాలు చేసుకోవడం కంటే, ఇకపై జరుగవలసిన విషయాల గురించి అందరూ ఆలోచిస్తే బాగుంటుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిజమే కదా?