గత ఏడాది జూలై 29న లిబియాలో ఉగ్రవాదుల చేతికి చిక్కిన ప్రొఫెసర్స్ బలరాం కిషన్, గోపీ కృష్ణ ఇద్దరూ క్షేమంగా శనివారం హైదరాబాద్ లో వారి ఇళ్ళకి చేరుకొన్నారు. వారి రాకతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.
వారిలో బలరాం కిషన్ కరీంనగర్ కి చెందినవారు. . బలరాం కిషన్ సిర్త్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేసేవారు. ఆయన లిబియా వెళ్ళక ముందు 2004-2007 వరకు భువనగిరిలోని అరోరా కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేసేవారు. ఆయన భార్య పేరు శ్రీదేవి. వారికి విజయభాస్కర్, మధుసూధన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వారు ఖానాజి గూడాలో నివాసం ఉంటున్నారు.
గోపీకృష్ణ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి చెందినవారు. ఆయన కూడా సిర్త్ యూనివర్సిటీలో కంప్యుటర్ సైన్స్ ప్రొఫెసర్ గా చేసేవారు. ఆయన భార్య పేరు కల్యాణి. వారికి జాహ్నవి, కృష్ణ సాయి అనే ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారు నాచారంలోని రాఘవేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు.
గత 14 నెలలుగా వారూ, వారి కుటుంబసభ్యులు అనుభవించిన మానసికవేదన అంతా ఒక్కసారిగా నిన్న తుడిచి పెట్టేసినట్లు మాయంఅయిపోయింది. రెండు కుటుంబాలలో సంతోషం వెల్లివిరుస్తోంది. వారి బంధుమిత్రులు, వివిధ పార్టీలకి చెందిన రాజకీయ నేతలు, అధికారులు, చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలు వారిని అభినందించేందుకు తరలివస్తున్నారు.
వారిరువురూ గత 7-8 సంవత్సరాలుగా లిబియాలోని సిర్త్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ప్రతీ ఏటా శలవులకి ఇళ్ళకి వచ్చిపోతుండేవారు. గత ఏడాది కూడా శలవుపై ఇళ్ళకి బయలుదేరినప్పుడు వారిద్దరినీ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారితో బాటు కర్నాటకకి చెందిన మరో ఇద్దరు ప్రొఫెసర్లని కూడా కిడ్నాప్ చేశారు కానీ వారిద్దరినీ వారం రోజుల తరువాత విడిచిపెట్టారు. కానీ బలరాం కిషన్, గోపీ కృష్ణలని మాత్రం విడిచిపెట్టకుండా బందించి ఉంచారు.
ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో చిక్కినప్పుడే తాము ప్రాణాలపై ఆశలు వదిలేసుకొన్నామని గోపీ కృష్ణ చెప్పారు. వారు ఎప్పుడు తమ ప్రాణాలు తీస్తారోనని క్షణం క్షణం భయంతో భారంగా రోజులు వెళ్ళదీశామని చెప్పారు. ఉగ్రవాదులు అసలు తమని ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదని, తమని రక్షించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితులలో 14 నెలలు నరకయాతన అనుభవించామని చెప్పారు. కానీ ఉగ్రవాదులు తమకి ఎటువంటి హానీ చేయలేదని, ఏదో ఆహారం పెట్టేవారని అది తింటూనే భయం భయంగా బ్రతికమని అన్నారు.
తరచూ తమని ఒక చోట నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తుండేవారని, ఆ కారణంగా తాము ఎక్కడ ఉన్నామో తెలియని పరిస్థితిలో క్షణమొక నరకంగా రోజులు గడిపామని చెప్పారు. చివరికి తమ అదృష్టం కొద్దీ అమెరికన్ సైనికులు ఉగ్రవాదుల చెర నుంచి తమని విడిపించారని చెప్పారు. ఇది తమకి పునర్జన్మ వంటిదేనని గోపీకృష్ణ చెప్పారు. నిజమే కదా! ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో చిక్కి ప్రాణాలతో బయటపదాటం అసాధ్యం కానీ అదృష్టవశాత్తు బయటపడగలిగారంటే వారు మృత్యుంజయులే.