ఇద్దరు మాజీల యుద్ధం..ఏమి సాధిద్దామనో?

వారిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో భుజాలు రాసుకొని తిరిగినవారే. ప్రస్తుతం ఇద్దరూ రాజకీయ నిరుద్యోగులే. ఒకరు కాలక్షేపం కోసం ఏదో పుస్తకం వ్రాశారు. దానిని పట్టుకొని ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు  వాదోపవాదాలు చేసుకొంటున్నారు. వారే మాజీ కాంగ్రెస్ ఎంపిలు ఉండవల్లి అరుణ్ కుమార్, జైపాల్ రెడ్డి.


రాష్ట్ర విభజన గురించి ఉండవల్లి ‘విభజన కధ’ అనే ఒక పుస్తకం వ్రాశారు. దానికి ‘నా డైరీలో కొన్ని పేజీలు’ అనే మంచి క్యాచీ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అటువంటి విషయంపై పుస్తకం వ్రాస్తే అది రచయిత దృక్కోణం నుంచే వ్రాయబడుతుంది. కనుక తాను తప్ప మిగిలిన వాళ్ళు అందరూ పొరపాట్లు చేశారని ఎవరో ఒకరిపై విమర్శలు చేయడమూ సహజమే. ఆయన తన పుస్తకంలో జైపాల్ రెడ్డిపై విమర్శలు చేశారు. విభజన బిల్లు ఆమోదానికి స్పీకర్ ఛాంబర్ లో కాంగ్రెస్-భాజపాల మధ్య రాజీ కుదిరిన తరువాత మూజువాణి ఓటుతో ‘విభజనని ‘మమ’ అనిపించేశారని తన పుస్తకంలో ఆరోపించారు.

 

దానికి జైపాల్ రెడ్డి కూడా పార్లమెంటరీ సంప్రదాయాలు అంటూ ఏదో గంభీరమైన పదాలతో జవాబిచ్చారు. ఆయనకీ ఉండవల్లి మళ్ళీ ఏవో ప్రశ్నలు సందించారు. ఈవిధంగా ఇద్దరు మాజీలు రెండేళ్ళ క్రితం జరిగిపోయిన రాష్ట్ర విభజన వ్యవహారాన్ని పట్టుకొని వాదోపవాదాలు చేసుకొంటున్నారు. నిజానికి వారిద్దరూ రాష్ట్ర విభజన సమయంలో ఏనాడూ ధైర్యంగా తమ అధిష్టానాన్ని నిలదీసి ప్రశ్నించినవారు కారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు తమ అధిష్టానంపై ఆగ్రహంతో తమ పదవులకి, పార్టీకి కూడా రాజీనామాలు చేసేశారు. కానీ ఉండవల్లి, జైపాల్ రెడ్డి మాత్రం ఇద్దరూ ఆఖరి నిమిషం వరకు తమ పదవులు పట్టుకొని వ్రేలాడినవారే.


వారిలో జైపాల్ రెడ్డి తెలంగాణాకి ముఖ్యమంత్రి అవ్వాలని ఎంతగా పరితపించారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇద్దరూ రాజకీయ నిరుద్యోగులు కావడంతో ఈ అసందర్భ వాదోపవాదాలు చేసుకొంటూ ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. జైపాల్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కనుక ఆయన రాజకీయాల గురించి మాట్లాడినా అర్ధం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి రాజినామా చేసి రాజకీయాలకి దూరంగా ఉంటున్న ఉండవల్లి ఇంకా ఎందుకు బకురుకొంటున్నారో తెలియదు.