హైదరాబాద్ నగరరంలో ఎన్నడూ ఇంత బారీ వర్షాలు పడలేదు. కనుక ఊహించని ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియని పనే. అందుకే ఇంత బారీ వర్షాలలో కూడా చెమటలు పడుతున్నాయి. వర్షాల వలన ముంపుకి గురవుతున్న ప్రాంతాల నుంచి ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, మరోవైపు ఎక్కడికక్కడ నిలిచిపోతున్న బారీ ట్రాఫిక్ వలన ఇబ్బందులు..స్కూళ్ళకి, పరిశ్రమలకి శలవులు ప్రకటించవలసిరావడం...ఒకటేమిటి..ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలన్నీ ఎన్నడూ ఊహించనివే.
ఈ బారీ వర్షాలు ప్రభుత్వానికి, ముఖ్యంగా పట్టణాభివృద్ధి, మున్సిపల్, విద్యుత్, వైద్య తదితర శాఖలకి, నగర ప్రజలకి, పరిశ్రమలకి అందరికీ కొన్ని గుణపాఠాలు నేర్పుతున్నాయని చెప్పక తప్పదు. నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఇటువంటి పరిస్థితులని ఏ మాత్రం తట్టుకోలేదని నిరూపించబడింది కనుక వర్షాలు తగ్గిన తరువాత ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి సారించక తప్పదు.
ఇటువంటి పరిస్థితులు తరచూ వస్తాయని భావించనవసరం లేదు. కానీ వస్తే దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉండాలి. అందుకోసం అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలు వగైరా ఏర్పాటు చేసుకొంటే మంచిది. అవసరమైతే కేంద్రప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవచ్చు.
ఇంకా ఎంత కాలం ఇలాగ బారీ వర్షాలు కురుస్తాయో చెప్పడం కష్టమే కానీ ఇలాగే మరికొన్ని రోజులు కురిసినట్లయితే, హైదరాబాద్ లో పురాతన భవనాలు, నిరుపేదల ఇళ్ళు కుప్పకూలే ప్రమాదం ఉంది. నగరం నిండా అటువంటివి కోకొల్లలు ఉన్నాయి కనుక ప్రభుత్వం వాటినన్నిటినీ గుర్తించి తగు చర్యలు చేపట్టవలసి ఉంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ వర్షాలలో నిరుపేదల దుస్థితి చూసిన తరువాత ఎక్కడికక్కడ కనీసం సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ళయినా నిర్మించి ఇస్తే బాగుంటుందనిపిస్తుంది.
అలాగే ఈ వర్షాల వలన ఐటి, పారిశ్రామిక రంగాలు చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి. కొంతలో కొంత నష్టం తగ్గించుకొనేందుకు ఐటి ఉద్యోగులని వారి ఇళ్ళ నుంచే పని చేసేందుకు అనుమతించాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఇది చాలా మంచి ఆలోచనే కానీ కొన్ని సాంకేతిక కారణాల చేత అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కనుక ఇకపై ఐటి పరిశ్రమలకి దగ్గరలోనే టౌన్ షిప్స్ అభివృద్ధి చేయడం వీలవుతుందేమో ప్రభుత్వం పరిశీలిస్తే బాగుంటుంది. లేదా ఇక ముందు ఆ రెండూ ఒకేచోట ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు, పాలసీలు రచించుకొంటే బాగుంటుంది. రాష్ట్రానికి అక్షయపాత్ర వంటి ఐటి రంగం ఇటువంటి ఒడిడుకులు ఎదుర్కోవలసిరావడం అంత మంచి విషయం కాదు. ఇదే సమస్య మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే ఐటి వలస పక్షులన్నీ సురక్షిత ప్రాంతాలకి ఎగురుకొంటూ వలస వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.
ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ ఎదుర్కొంటున్న పరిస్థితిని, ఎదురవుతున్న సమస్యలని అన్నిటినీ ప్రభుత్వం కళ్ళారా చూస్తోంది కనుక ఇకనైనా గాలిమేడలు కట్టడం మానేసి ముందుగా ఈ సమస్యలన్నిటికీ శాశ్విత పరిష్కారాలు కనుగొని వాటిని ఖచ్చితంగా అమలు చేయవలసి ఉంది లేకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది.