రాష్ట్రంలో భాజపా నేతలు తెరాసతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక సతమతం అవుతుంటే, భాజపా అధిష్టానం, కేంద్రమంత్రులు వారి అయోమయాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గురించి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పిన మాటలు వింటే అది అర్ధం అవుతుంది. కెసిఆర్ ఆయన బృందం డిల్లీలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయని కలిసినప్పుడు ఆయన వారితో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్రమంత్రులకి ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే చాలా అభిమానం ఉందని చెప్పారు. అదేవిధంగా పార్లమెంటులో దేశానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరుగుతునప్పుడు తెరాస ఎంపిలు మాట్లాడుతున్న తీరు, వాటిపై వారికున్న అవగాహన చూసి లోక్ సభ స్పీకర్, కేంద్రప్రభుత్వం కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణా ప్రభుత్వం తన దృష్టికి తీసుకు వచ్చిన అన్ని పెండింగ్ అంశాలపై తాను చొరవ తీసుకొని పనులు పూర్తయ్యేలాగ కృషి చేస్తానని దత్తన్న వారికి హామీ ఇచ్చారు.
ఆయన చెప్పిన ఈ మాటలు ముఖ్యమంత్రి కెసిఆర్ కి, తెరాస ప్రభుత్వానికి, తెరాస ఎంపిలు, నేతలకి చాలా ఉత్సాహం, సంతోషం కలిగిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని, ఆయన ప్రభుత్వ పాలనని తీవ్రంగా విమర్శిస్తున్న రాష్ట్ర భాజపా నేతలకి దత్తన్న చెప్పిన ఈ మాటలు జీర్ణించుకోవడం కష్టమే. ఒకవైపు తామంతా కెసిఆర్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తుంటే తమకి అండగా నిలవవలసిన దత్తన్న, ఆయన సహచర కేంద్రమంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ కెసిఆర్ కి అండగా నిలబడుతూ, ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ, ఆయనని, తెరాస ఎంపిలని ఈవిధంగా పొగుడుతుంటే ఇక తమని ప్రజలు నమ్ముతారా? అని రాష్ట్ర భాజపా నేతలు వాపోతున్నారు.
వారి బాధని పోగొట్టేందుకు ఏకైక పరిష్కారం ఏమిటంటే తెరాసతో భాజపా తక్షణం పొత్తులు పెట్టేసుకోవడమే. అప్పుడు రాష్ట్ర భాజపా నేతలు కూడా కేంద్రమంత్రులతో కలిసి కెసిఆర్ ని, ఆయన ప్రభుత్వాన్ని నోరారా ఏమాత్రం మొహమాట పడకుండా పొగుడుకోవచ్చు. కెసిఆర్ ఒప్పుకొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానే తెరాస సర్కార్ లో రెండు మంత్రి పదవులు పుచ్చుకోవచ్చు. కవితమ్మకి కేంద్రమంత్రి పదవి దక్కుతుంది కూడా!