రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకి ఎన్ని అవరోధాలు, అభ్యంతరాలు ఎదురవుతున్నప్పటికీ తెరాస సర్కార్ దానిని పూర్తిచేస్తోంది. దసరా (అక్టోబర్ 11) నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడతాయి. రాష్ట్ర విభజన సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కనుక దానిని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కోరారు. పరిపాలనా వికేంద్రీకరణ, పాలనా సౌలభ్యం కోసం తాము జిల్లాల పునర్విభజన చేశామని కనుక, కేంద్ర ప్రభుత్వం కూడా తన హామీని నిలబెట్టుకొని ప్రస్తుతం ఉన్న119 అసెంబ్లీ నియోజకవర్గాలని 153కి పెంచాలని కెసిఆర్ కోరారు.
కెసిఆర్ చేసిన విజ్ఞప్తికి హోం మంత్రి ఏ విధంగా స్పందించారో తెలియదు కానీ 2026 సం. వరకు అటువంటి ఆలోచనే చేయబోమని ఇదివరకే కేంద్ర సహాయ మంత్రి ఒకరు పార్లమెంటులో విస్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఆంధ్రా, తెలంగాణాలకి హామీ ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వం అందుకు పూనుకొన్నట్లయితే దేశంలో అన్ని రాష్ట్రాల నుండి కూడా అటువంటి డిమాండ్లు వస్తాయి. బహుశః ఆ భయంతోనే కేంద్రం వెనుకంజ వేస్తోందని భావించవచ్చు.
కానీ వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ పూర్తిచేసి నియోజక వర్గాల సంఖ్య పెంచనట్లయితే తెరాస పార్టీ చాలా చిక్కులో పడుతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు తప్పకుండా పెరుగుతాయనే నమ్మకంతోనే అది ప్రతిపక్ష పార్టీల నేతలని, ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకొంది. ఒకవేళ అసెంబ్లీ స్థానాలు పెరుగకపోయినట్లయితే, చిరకాలంగా పార్టీలో ఉన్నవారికి, కొత్తగా చేరినవారికీ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న 153 సీట్లు సరిపోవు. దాని వలన పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది.
టికెట్స్ దొరకని వారందరూ మళ్ళీ తమ స్వంతపార్టీలకి తిరిగి వెళ్ళిపోతే ఎన్నికలకి ముందు పార్టీ చాలా బలహీనపడే ప్రమాదం ఉంది. కనుక పరిపాలనా సౌలభ్యం కోసం కాకపోయినా తెరాస కోసమైనా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ చేయడం చాలా అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించకపోతే తెరాస పరిస్థితి ఏమిటి? అప్పుడు ఏమి చేయాలి అని ఆలోచించుకొంటే మంచిది. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెదేపాలో కూడా సరిగ్గా ఇటువంటి సమస్యే ఎదుర్కొంటోంది కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయవచ్చు. వారికి అంతకంటే వేరే మార్గం లేదు కూడా.