తెలంగాణా ప్రభుత్వం మిషన్ కాకతీయ పధకంతో రాష్ట్రంలో చెరువులని పునరుద్దరిస్తుంటే వరుణదేవుడు కూడా అది చూసి ముచ్చటపడి హైదరాబాద్ నగరాన్నే పెద్ద చెరువుగా మార్చేసినట్లున్నాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలతో హైదరాబాద్ చెరువుల నగరంగా మారిపోయింది. నగరంలో ఇళ్ళలోని నీళ్ళే..బయటా నీళ్ళే..నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళే. హైదరాబాద్ ఇప్పుడు నీళ్ళలో తేలియాడుతున్న నగరంలాగా మారిపోయింది. మరో విచిత్రం ఏమిటంటే సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు డిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నీళ్ళ కోసం కీచులాడుకోవడం. దానికీ ఈ వర్షాలకి ఏమీ సంబంధం లేకపోయినా, హైదరాబాద్, గుంటూరు నగరాలని వరదలు ముంచెత్తుతుంటే అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు నీళ్ళ కోసం కీచులాడుకోవడం నవ్వు తెప్పించకమానదు.
హైదరాబాద్ అన్ని ప్రధాన కూడళ్ళలో బారీగా నీళ్ళు ఏరులై పారుతుండటంతో అనేక వాహనాలు వాటిలో చిక్కుకుపోయాయి. ఎర్రగడ్డ, బాల్కంపేట్, బేగంపేట,ఖైరతాబాద్, రాణీగంజ్, బేగం బజార్, పంజాగుట్ట, రేతిబౌలి, మొహిదీపట్నం, లక్డీకాపూల్, నాంపల్లి, కోటి, అంబార పేట, చిలకలగూడా, బహదూర్ పురా క్రాస్ రోడ్స్, మీరాలం ట్యాంక్ , బండ్ల గూడ, మలక్ పెట్, దిల్షుక్ నగర్ వంటి అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక చోట్ల ఇళ్ళలోకి కూడా నీళ్ళు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మంత్రి కెటిఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకి ధైర్యం చెపుతూ, సహాచర్యలని పర్యవేక్షిస్తున్నారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా నగరంలో పర్యటిస్తూ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి కెటిఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నగరంలో ఏర్పడిన ఈ దుస్థితి చూసిన తరువాత ఇకపై ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు హైదరాబాద్ ని తామే అభివృద్ధి చేశామని చెప్పుకోలేరనిపిస్తుంది. నగరంలో ఈ దుస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం డ్రైనేజ్ వ్యవస్థని ఆధునీకరించకపోవడమేనని చెప్పక తప్పదు. దాని కోసం ప్రభుత్వం ఆక్రమణలు తొలగించడానికి పూనుకొంటే భాదిత ప్రజలు ఆందోళన చేస్తారు. వెంటనే ప్రతిపక్షాల నేతలు అక్కడ వాలిపోయి ప్రభుత్వ చర్యలని నిరసిస్తూ విమర్శలు గుప్పిస్తూ ధర్నాలు చేయడం మొదలుపెడుతుంటారు. కనుక ఈ సమస్యకి ప్రభుత్వానికి ఎంత బాధ్యతః ఉందో ప్రతిపక్షాలకి కూడా అంతే ఉందని చెప్పక తప్పదు. హైదరాబాద్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు అందరికీ అర్ధం అయ్యింది కనుక ఇకనైనా ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు అందరూ కలిసి శాశ్వితనివారణ కోసం ఏమి చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది.