ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల పునర్విభజన విషయంలో ఎంత లోతుగా అధ్యయనం చేసి విభజనకి పూనుకొంటునప్పటికీ, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజలు, ప్రతిపక్షాలు చివరికి స్వంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోక తప్పడం లేదు. ప్రజలు, ప్రతిపక్షాలు అభ్యంతరాలు తెలుపడం సహజమే కానీ అధికార పార్టీకి చెందిన వాళ్ళే అభ్యంతరాలు చెపుతుండటంతో కెసిఆర్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో వికారాబాద్ ని జిల్లాగా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో వికారాబాద్ ప్రస్తావనే లేదని స్థానిక తెరాస ఎమ్మెల్యే బి.సంజీవ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తున్నపట్టికీ, ముఖ్యమంత్రి కెసిఆర్ తనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకొంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ వికారాబాద్ ని జిల్లాగా ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంజీవ్ రావు హెచ్చరించారు.
ఇక జనగామని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ నేతలతో తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా కలిశారు. గద్వాల్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆందోళన సాగిస్తున్నారు. సిరిసిల్లా కోసం జిల్లా సాధన నేతలు చాలా తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దాని కోసం రెండు రోజులు బంద్ కూడా పాటించారు. అదేవిధంగా ములుగుని జిల్లాగా ప్రకటించాలని ఆ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాని రెండు జిల్లాలుగా విడదీయడాన్ని ఆ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముదోల్ ఎమ్మెల్యే జి.విట్టల్ తన నియోజక వర్గాన్ని పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో లేదా సిరిసిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మద్దతు పలుకుతుండటం విశేషం.
జిల్లాల పునర్విభజన ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని ప్రభుత్వం భావిస్తుంటే, నేటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో అధికార పార్టీ నేతలు కూడా పాల్గొంటుండటమే ముఖ్యమంత్రి కెసిఆర్ కి తలనొప్పిగా మారింది. వారిలో నిజంగా జిల్లాల ఏర్పాటుని వ్యతిరేకిస్తున్న వారు ఎందరో, ప్రజాగ్రహానికి భయపడి వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్నవారు ఎందరో కెసిఆర్ కే తెలియాలి.