కేశవ్ రావు భలే ప్రశ్న వేశారు...సమాధానం ఉందా?

ఆంధ్రా, తెలంగాణాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతూనే ఉన్నాయి. తెరాసలో చేరిన 12 మంది తెదేపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రలో తెదేపా ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంటే, నిన్న అపెక్స్ కౌన్సిల్లో ఏపి సిఎం చంద్రబాబు, ఆంధ్రా అధికారులు తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ చేసిన వాదనల ప్రభావం తెలంగాణా తెదేపాపై ప్రసరిస్తోంది.

తెరాస సెక్రటరీ జనరల్ కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ, “హరీష్ రావుగారు తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడేందుకు అపెక్స్ కౌన్సిల్లో చాలా గట్టిగా వాదించారు. చంద్రబాబు వాదనలని చాలా సమర్ధంగా త్రిప్పి కొట్టినందుకు ఆయనని అభినందిస్తున్నాను. ఏపి సిఎం తెలంగాణా ప్రాజెక్టులని అడ్డుకొంటున్నారని మేము చెపుతున్న మాట నిజమేనని స్వయంగా  చంద్రబాబు నాయుడే నిన్న నిరూపించుకొన్నారు. మరి ఇప్పుడు తెలంగాణా తెదేపా నేతలు ఏమని సమాధానం చెపుతారు? వారి అధినేత చంద్రబాబుని వెళ్ళి నిలదీయగలరా? నిలదీయలేకపోతే ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరకి వెళతారు? ప్రజలు కూడా నిలదీస్తే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకొంటారు?” అని ప్రశ్నించారు.

కేశవ్ రావు ప్రశ్న ఆలోచింపజేసేదిగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన రాష్ట్ర ప్రయోజనాలని కాపాడేందుకు గట్టిగా వాదించడం సహజమే. కానీ ఆయన తెదేపా పార్టీ అధినేత కూడా. కనుక రాష్ట్రంలో తెదేపా నేతలు ఈ విషయంలో ప్రజలకి సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోవడం చాలా కష్టమే. పైగా చంద్రబాబు తనకి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళవంటివని తెలుగు ప్రజలు అందరూ తనకి సమానమే అని చెపుతున్నప్పుడు, ఆయన తెలంగాణాలో ప్రాజెక్టులని వ్యతిరేకించడం వలన కూడా రాష్ట్రంలో తెదేపా నేతలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. 

ఎల్. రమణ, రేవంత్ రెడ్డి వంటి వారు అందరూ అచ్చమైన తెలంగాణావారే అయినప్పటికీ, ఇటువంటి కారణాల వలననే వారిని, వారి పార్టీని ప్రజలు విశ్వసించలేకపోతున్నారని చెప్పక తప్పదు. ఈ సమస్య తెలంగాణా తెదేపా నేతలకే కాదు, కాంగ్రెస్, వైకాపా నేతలకి కూడా ఉంది. కానీ ఏపిలో తెదేపా ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక అది తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీ మాట తెలంగాణా తెదేపాపై విపరీతమైన దుష్ప్రాభావం చూపుతోందని చెప్పవచ్చు.