తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు ఆసక్తికరమైన పరిణామాలు కలిగాయి. 1. తెరాస సర్కార్ కి ఎదురుదెబ్బ 2. ఏపిలో తెదేపా సర్కార్ కి ఇబ్బందికర పరిస్థితి 3.రాష్ట్రంలో వైకాపా కూడా హైకోర్టుని ఆశ్రయించే యోచన చేయడం.
తెరాసలో చేరిన 12 మంది తెదేపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆయనతో సహా రాష్ట్రంలో తెదేపా నేతలందరూ విజయం సాధించినట్లు గర్వపడుతున్నారు. హైకోర్టు చేత తెరాస సర్కార్ కి మళ్ళీ మొట్టికాయలు వేయించగలిగినందుకు చాలా సంతోషిస్తున్నారు. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి కెసిఆర్ కి చెంపదెబ్బ వంటిదేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఈ తీర్పు ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా చెంపదెబ్బేనని చెప్పక తప్పదు. కెసిఆర్ కాంగ్రెస్, తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలని ఫిరాయింపులకి ప్రోత్సహిస్తే, చంద్రబాబు ఆంధ్రాలో 20 మంది వైకాపా ఎమ్మెల్యేలని ప్రోత్సహించి తెదేపాలో చేర్చుకొన్నారు. కనుక అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కూడా హైకోర్టు తీర్పుని స్వాగతించింది. ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా హైకోర్టు తీర్పుని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఆ 20 మంది వైకాపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు లేకుంటే తాము కూడా హైకోర్టుకి వెళతామని హెచ్చరించారు. ఈ పరిణామాన్ని తెదేపా ముందుగా ఊహించిందో లేదో తెలియదు కానీ వైకాపాకి జవాబు చెప్పలేక చాలా ఇబ్బందిపడుతోంది.
ఇక తెలంగాణాలో వైకాపా ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి కూడా హైకోర్టు తీర్పుని స్వాగతించి, తెరాసలో చేరిన తమ ముగ్గురు ఎమ్మెల్యేలపై 4-5వారాలలోగా అనర్హత వేటు వేయాలని చేశారు లేకుంటే తాము కూడా హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు.
రాజకీయాల స్థాయిని దిగజార్చుకొని, అనైతికంగా అప్రజాస్వామ్య పద్దతులలో ముందుకు వెళితే ఎటువంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో ఈ మూడు పరిణామాలు నిరూపిస్తున్నాయి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి అప్రదిష్టనైనా భరించడానికి సిద్దంగా ఉన్నవారు ఇటువంటి చిన్న చిన్న అవమానలని పట్టించుకోరని అందరికీ తెలుసు.