ఏపి, తెలంగాణా రాష్ట్రాల మధ్య సాగుతున్న జలవివాదాల పరిష్కారం కోసం ఈరోజు డిల్లీలో శ్రమశక్తి భవన్ లో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటి శాఖ మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యి తమ తమ వాదనలు వినిపించారు. కానీ ఊహించినట్లే ఈ సమావేశంలో ఏ ఒక్క సమస్యకి పరిష్కారం కనుగొనలేకపోయారు. నిజానికి అవేవీ ఒక సమావేశంలోనే మాట్లాడేసుకొని పరిష్కరించేసుకోగల చిన్న సమస్యలు కావు కూడా. ఈ సమావేశంలో మూడు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రుల మద్య ఏకాభిప్రాయం కుదిరిందని ఉమాభారతి చెప్పారు.
1.నీటి వాడకాన్ని లెక్క కట్టేందుకు టెలిమెట్రీ విధానం ప్రవేశపెట్టడం. దామాషా పద్దతిలో నీటిని వాడుకోవడం.
2.నీటి లభ్యతని అధ్యయనం చేసి ట్రిబ్యునల్ కి నివేదిక ఇచ్చేందుకు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు, కేంద్ర ప్రతినిధితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం.
3.ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జలవివాదాలని ఈ మూడు పరిష్కార మార్గాలు కావని అర్ధం అవుతూనే ఉంది. టెలిమెట్రీ విధానం ప్రవేశపెట్టడం మంచిదే కానీ రెండు రాష్ట్రాలు న్యాయంగా ఎవరి వాటా నీళ్ళని అవే వాడుకొనే ఆలోచనే ఉండి అసలు ఇది అవసరమే ఉండేది కాదు. కనుక ఈ పద్దతిలో నీళ్ళు వాడుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. అంతవరకు రెండు రాష్ట్రాలు చాలా సంయమనం పాటించవలసి ఉంటుంది. అప్పుడే ఈ పద్ధతి విజయవంతం అవుతుంది.
ఇంకా కమిటీ ఏర్పాటు చేయడం అంటే దానర్ధం సమస్యని వాయిదా వేయడమేనని చెప్పవచ్చు. అయినా కృష్ణా, గోదావరి బోర్డులనే ఖాతరు చేయని రెండు ప్రభుత్వాలు కమిటీ ఇచ్చిన సలహాలని పాటిస్తాయని ఆశించలేము.
ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టులు నిర్మించడం తెలంగాణా ప్రభుత్వం ఊహించని విషయమే. తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకి సాంకేతిక కారణాల చేత నిలిపివేయమని ట్రిబ్యునల్ ఆదేశిస్తే నిలిపివేస్తుందా? అంటే కాదనే సమాధానం వస్తుంది. ఆ ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న కారణంగానే ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కానీ ఆ వివాదంపై ఎటువంటి పరిష్కారం కనుగొనకుండానే సమావేశం ముగిసింది. కనుక తెలంగాణా ప్రభుత్వం ఆ ప్రాజెక్టులని కట్టక మానదు. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు చెప్పక మానదు. కనుక ఈ సమావేశంలో ఏమి సాదించారంటే అందరూ కలిసి కొండని త్రవ్వి ఎలుకని పట్టారనుకోవలసి ఉంటుంది.