రెండున్నరేళ్ళలో తెరాస సర్కార్ కోర్టులలో ఎన్నోసార్లు మొట్టికాయలు వేయించుకొంది. ఈరోజు మళ్ళీ మరోసారి మొట్టికాయలు పడ్డాయి. ఈసారి పార్టీ ఫిరాయించిన తెదేపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించినందుకు, ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్ధన మేరకు తెదేపాని తెరాసలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించినందుకు మొట్టికాయలు తింది.
తెరాసలో చేరిన 12మంది తెదేపా ఎమ్మెల్యేలపై 90 రోజులలో తగిన చర్యలు చేప్పట్టవలసిందిగా హైకోర్టు స్పీకర్ ని ఆదేశించింది. తెదేపాని తెరాసలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణా అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10వ తేదీన జారీ చేసిన బులెటిన్ పై కూడా స్టే విదించింది. స్పీకర్ రెండు చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయనే రేవంత్ రెడ్డి అభిప్రాయంతో కోర్టు ఏకీభవించింది.
తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన తరువాత కూడా వారు నేటికీ తెదేపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. తెరాస సర్కార్ లో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అందుకు తెదేపా అభ్యంతరం తెలుపుతూ వారిపై అనర్హత వేటు వేయమని లిఖిత పూర్వకంగా స్పీకర్ మధుసూదనాచారిని అభ్యర్ధించింది. కానీ దానిని ఆయన పట్టించుకోలేదు. అంతకు ముందు వారిపై స్పీకర్ కి పిర్యాదు చేసిన తెదేపా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావే తెరాసలో చేరిన తరువాత తెదేపాని తెరాసలో విలీనం చేయమని కోరుతూ స్పీకర్ ని లేఖ ద్వారా కోరడం విశేషం.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న తెదేపా అభ్యర్ధనని పక్కన బెట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖపై స్పీకర్ స్పందించి తెదేపాని తెరాసలో విలీనం చేయడానికి ఆమోదం తెలుపడం, ఆమేరకు శాసనసభ కార్యదర్శి బులెటిన్ విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు తాజా తీర్పు ద్వారా తెరాస సర్కార్ కి మొట్టికాయలు వేసింది.
స్పీకర్ పరిధిలో అంశాలపై న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోలేవనే చట్టంలో లొసుగుని అడ్డుపెట్టుకొని ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించకుండా, పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగనిస్తున్నాయి. ప్రజలకి మార్గదర్శనం చేయవలసిన చట్టసభలు, ప్రభుత్వాలే చట్టంలో లొసుగుని అడ్డుపెట్టుకొని ఇటువంటి అనైతిక పనులకి పూనుకోవడం చాలా దురద్రుష్టకరమే.
హైకోర్టు తీర్పు వాటికి చెంప దెబ్బ వంటిదేనని చెప్పవచ్చు. కానీ అధికారమే పరమావధిగా భావిస్తున్న రాజకీయ పార్టీలు, వాటి ప్రజా ప్రతినిధులు ఇటువంటి అవమానలని పట్టించుకోవడం మానేసి చాలా కాలమే అయ్యింది. తమ గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో అని సిగ్గు పడటం లేదు కూడా. కనుక హైకోర్టు తీర్పుని స్పీకర్ పట్టించుకోకపోయినా ఆశ్చర్యం లేదు. సుప్రీంకోర్టు సవాలు చేసినా ఆశ్చర్యం లేదు.