తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దారుణంగా దెబ్బ తిన్న రోడ్ల పరిస్థితి గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు రెండు రోజుల క్రితమే తన పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీనగర్ కాలనీలో గుంతలు పడిన రోడ్లపై మొక్కలు నాటారు. మరి ఆ నిరసనకి మేల్కొన్నారో లేక హైదరాబాద్ లో చాలా దారుణంగా మారిన రోడ్ల పరిస్థితి గురించి మీడియాలో వస్తున్న వార్తలని చూసి కోపం వచ్చిందో తెలియదు గానీ మునిసిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు నిన్న అధికారులతో సమావేశమయ్యి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, కనుక ఇకనైనా అధికారులు తమ తీరు మార్చుకోకపోతే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై గుంతలు పూడ్చడం కూడా ఏదో చలా అసాధారణమైన పని అన్నట్లు అధికారులు మాట్లాడటం మాని శాశ్విత ప్రాతిపాదికన తక్షణమే నగరంలో రోడ్లన్నీ మరమత్తులు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి తాను కూడా తరచూ నగరంలో పర్యటిస్తూ రోడ్లని పరిశీలిస్తుంటానని, ఎక్కడైనా రోడ్లు సరిగ్గా లేకపోతే సంబంధిత అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. ఈ సమస్య శాశ్విత పరిష్కారం కోసం నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతీనెలా సమావేశాలు నిర్వహిస్తానని కెటిఆర్ చెప్పారు.
అసలు ఇటువంటి పనులన్నీ అధికారుల స్థాయిలోనే జరిగిపోవాలి కానీ నగరంలో రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నాయని ప్రజలు, మీడియా గొంతు చించుకొని చెపుతున్నా అధికారులు మేల్కొనలేదు. చివరికి ఇంత చిన్న సమస్య కోసం ప్రతిపక్షాలు కూడా రంగంలో దిగవలసివచ్చింది. అయినా అధికారులు అలసత్వం వీడకపోవడంతో స్వయంగా మంత్రి కెటిఆర్ కలుగజేసుకోవలసి వచ్చింది. ఆయన చెప్పినట్లుగా ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఇటువంటి సమస్యల వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత కూడా పెరుగుతుంది.
ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడి జీతభత్యాలు పెంచుకోవడంలో చూపే శ్రద్ధ, తమ భాద్యతలని సక్రమంగా, సమర్ధంగా నిర్వర్తించడంలో కూడా చూపితే వారికీ ప్రభుత్వానికి కూడా మంచిపేరు వస్తుంది కదా. అయినా కెటిఆర్ చెప్పినట్లు రోడ్ల మీద గుంతులు పూడ్చడం కష్టమైనా పనేమీ కాదు కదా? అందుకు అవసరమైనవన్నీ ప్రభుత్వం సమకూరుస్తున్నప్పుడు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? వారు కూడా ఈ హైదరాబాద్ నగరంలోనే జీవిస్తున్నారు కదా? నగరంలో రోడ్లు ఈవిధంగా ఉంటే అది తమకి అవమానం కాదా? ప్రజలు, మీడియా తిట్టిపోస్తున్నప్పుడైన కనీసం సిగ్గుపడి రోడ్లు రిపేర్లు చేయాలి కదా? అధికారుల స్థాయిలో జరుగవలసిన ఈ పనులని కూడా మంత్రి స్వయంగా పర్యవేక్షించవలసి రావడం వారికి సిగ్గుచేటని భావించడం లేదా? అధికారులే ఆలోచించుకోవాలి.