సాగునీటి సమస్యలే తెలంగాణా ఉద్యమాలకి, రాష్ట్ర ఆవిర్భావానికి కారణం అని అందరికీ తెలుసు. కనుక తెరాస అధికారంలోకి రాగానే ఆ సమస్యలని పరిష్కరించడానికి యుద్ద ప్రాతిపదికన అనేక చర్యలు చేపట్టింది. వాటిలో పొరుగు రాష్ట్రాలతో సాగునీటి సరఫరా, ప్రాజెక్టుల నిర్మాణాలకి ఒప్పందాలు చేసుకోవడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలైనవి ఉన్నాయి. కానీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టుల వలన దిగువనున్న తమకి త్రాగు, సాగునీరు అందక చాలా నష్టం జరుగుతుందని వాదిస్తోంది.
తెలంగాణా ప్రభుత్వ వాదన మరోలా ఉంది. “మాకు న్యాయంగా దక్కవలసిన నీళ్ళని మాత్రమే మేము వాడుకోవాలనుకొంటున్నాము తప్ప ఆంధ్రాకి అన్యాయం చేయాలనే ఆలోచన మాకు లేదు,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టిగా చెపుతున్నారు. గోదావరి జలాలని రెండు రాష్ట్రాలు పూర్తిగా వాడుకొన్న తరువాత కూడా ఇంకా అనేక వందల టి.ఎం.సి.ల నీళ్ళు వృధాగా సముద్రంలో కలిసిపోతాయని, ఆ సంగతి చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు గనుకనే గోదావరి మిగులు జలాలని వాడుకొనేందుకే పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించారని చెపుతున్నారు. అది నిజం కూడా.
కానీ తెలంగాణాలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. అయితే ఈ సమస్యలు కోర్టులలో తేల్చగలిగేవి కావని, కేంద్రప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఈ సమస్యని చర్చించుకొని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దాని సూచన మేరకు కేంద్రప్రభుత్వం ఈ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి నేడు సమావేశం నిర్వహిస్తోంది.
దశాబ్దాలుగా తెలంగాణాకి సాగునీటి విషయంలో అన్యాయం జరుగింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా ఆంధ్రా పాలకులు తెలంగాణాలో ప్రాజెక్టులని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెరాస సర్కార్ మండిపడుతోంది. ఎగువనున్న తెలంగాణా ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు నిర్మించుకొంటూ, దిగువకి నీళ్ళు రాకుండా వాడేసుకొంటుంటే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
రెండు రాష్ట్రాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉండబోతున్నట్లు వాటి తీరు చూస్తుంటేనే అర్ధం అవుతోంది. కనుక ఈరోజు జరుగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏవో అద్భుతాలు జరిగిపోతాయని, సమస్యలన్నీ మంత్రదండంతో మాయం చేసేసినట్లు మాయం అయిపోతాయని ఆశించడం చాలా అత్యాశే అవుతుంది. దీని వలన మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య కొత్తగా గొడవలు మొదలవకుండా ఉంటే అదే పదివేలు!