రాష్ట్ర ప్రభుత్వంలో ఐటి, పరిశ్రమలు, మునిసిపల్ వంటి చాలా కీలకమైన శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తున్న కెటిఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లాని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గత నెలరోజులుగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ గడువు రేపటితో ముగుస్తుండటంతో వారు తమ ఆందోళనలని ఇంకా తీవ్రం చేశారు. ఆందోళనకారులు నేటి నుంచి 48గంటలు సిరిసిల్లా పట్టణం బంద్ కి పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయం నుంచే సిరిసిల్లా పట్టణం దాదాపు స్తంభించిపోయింది. రోడ్లపైకి వచ్చిన ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్ళూ రువ్వుతుండటంతో బస్సులు కూడా తిరగడం లేదు. ఈరోజు ఉదయం పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద జిల్లా సాధన సమితి సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తులని పట్టించుకోకుండా ఏకపక్షంగా జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని జిల్లా సాధనసమితి కన్వీనర్ ఎ. రమాకాంత రావు తప్పు పట్టారు.
సాక్షాత్ కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లాలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంది. వరంగల్ మినహా ప్రభుత్వం ప్రకటించిన మిగిలిన జిల్లాల విషయంలో బహుశః ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చునని ప్రభుత్వ వైఖరిని బట్టి అర్ధం అవుతోంది. దీనిపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకొన్నట్లే ఉంది. ఈనెల 27న మంత్రివర్గ సమావేశం నిర్వహించి 28,29,30 తేదీలలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. కనుక జిల్లాల పునర్విభజన అంశంపై ఏకంగా శాసనసభలోనే చర్చించి, ఆ ప్రతిపాదనకి ఈ సమావేశాల్లోనే డానికి ఆమోదముద్ర వేస్తారు. శాసనసభ ఆమోదముద్ర పడిన వెంటనే జిల్లాల ఏర్పాటుకి తుది నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. కనుక సిరిసిల్లా లేదా మరెక్కడైనా జిల్లాలు, మండలాల ఏర్పాటు కోసం ఈవిధంగా ఉద్యమాలు చేస్తున్నా వాటిని ప్రభుత్వం పట్టించుకొనే అవకాశం లేనట్లే భావించవచ్చు.