ఒక పక్క హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ శిక్షణా కార్యక్రమాల పేరుతో తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ ని దుమ్మెత్తిపోస్తుంటే, మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖమంత్రి కే. తారక రామారావుతో నిన్న సమావేశం అయ్యారు. తమ సమావేశానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని దానం నాగేందర్ చెప్పినప్పటికీ పార్టీలో అందరూ ఆయనని అనుమానంగానే చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాప్పుడు ఆయన వాటికి హాజరు కాకుండా వెళ్ళి మంత్రి కెటిఆర్ ని కలవడం చేత ఆయన తెరాసలోకి మారిపోయే ఆలోచనలో ఉన్నట్లు అందరూ అనుమానిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనే పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ ఆయన తెరాసలో చేరిపోయేందుకు సిద్దపడ్డారు. కానీ పార్టీలో సీనియర్ నేతలు ఆయనని బుజ్జగించి తెరాసలో చేరకుండా ఆపగలిగారు. అప్పటికి తాత్కాలికంగా ఆపగలిగారు కానీ తెరాసలో చేరాలనే ఆయన మనసులో ఆలోచనని తుడిచివేయలేకపోయారని ఇప్పుడు అర్ధం అవుతోంది. పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలున్న కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఇమడలేకపోతే, ‘ఆ నలుగురి’ చేతిలో నడుస్తున్న తెరాసలో అయన ఇమడగలరో లేదో దానం కాస్త ఆలోచించుకొంటే మంచిది కదా. కాంగ్రెస్, తెదేపాల నుంచి తెరాసలో వెళ్ళిన నేతలకి ఆ పార్టీలో సరైన గుర్తింపు, ఆదరణ, స్వేచ్చ లేవని బాధపడుతున్నప్పుడు దానం నాగేందర్ వంటి దూకుడు మనస్తత్వం గల సీనియర్ నేత తెరాసలో సర్దుకుపోవడం చాలా కష్టమే.