ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని తనే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశానని, దానిని చూసినప్పుడల్లా తన మనసు చాలా సంతోషంతో నిండిపోతుందని గర్వంగా చెప్పుకొంటుంటారు. ‘హైదరాబాద్ నగరాభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు అది నిజాం కాలం నాటికే పూర్తిగా అభివృద్ధి చెందిపోయిందని’ ముఖ్యమంత్రి కెసిఆర్ వాదిస్తుంటారు. వారిద్దరి వాదనలు ఎలాగున్నప్పటికీ, ఇటీవల కురుస్తున్న బారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ జంట నగరాలలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల రోడ్లపై ఏర్పడిన పెద్దపెద్ద గోతులలో నీళ్ళతో నిండిపోయి చెరువులని తలపిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లు దెబ్బతిని మట్టి,రాళ్ళూ పైకి తేలడంతో ఆ రోడ్లపైనే నిత్యం ప్రయాణించే నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు.
ఈ సమస్యపై తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విన్నూత్నమైన పద్దతిలో నిరసన తెలిపారు. శ్రీనగర్ కాలనీ సమీపంలో రోడ్లపై ఏర్పడిన గుంతలలో ఆయన తన అనుచరులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆ సంగతి తెలుసుకొన్న తెరాస కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని రేవంత్ రెడ్డికి తమ నిరసనలు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని రేవంత్ రెడ్డి, అనుచరులని అరెస్ట్ చేశారు.
ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి కెటిఆర్ నగరాన్ని చాలా అభివృద్ధి చేసేశానని ట్వీట్టర్లో గొప్పలు చెప్పుకోవడమే తప్ప నగరంలో పర్యటించి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో పట్టించుకోరు. ఆయనకి ఎంతసేపు విదేశీ ప్రయాణాలు చేయడం, పెద్దపెద్దవాళ్ళతో కలిసి ఫోటోలు దిగడం, ట్వీటర్లో గొప్పలు వ్రాసుకోవడానికే సమయం సరిపోతుంది. ఆయన చేసిందేమీలేకపోయినా హైదరాబాద్ ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని, ఇస్తాంబుల్ నగరంలాగా అందంగా తీర్చి దిద్దుతామని చెపుతుంటారు. కానీ ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి చూస్తే ఇంతకంటే చెత్తనగరం మరొకటి ఉండదని అంగీకరిస్తారు. చెత్తనగరాలకి పోటీ పెట్టినట్లయితే హైదరాబాద్ కే తప్పకుండా ఫస్ట్ ప్రైజు వస్తుంది. కనీసం ఇప్పటికైనా ఆయన మేల్కొని నగరంలో పర్యటించి రోడ్ల పరిస్థితిని కళ్ళారా చూస్తే తన గొప్పదనం ఏమిటో తనకే అర్ధం అవుతుంది,” అని అన్నారు.
దేశంలో ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు దేశ ఆర్ధిక రాజధానిగా చెప్పుకోబడే ముంబై నగరం కూడా చిన్న వర్షం పడితే చాలా భీభత్సంగా తయారవుతుంది. ఉత్తరాది రాష్ట్రాలలో దాదాపు 80 శాతం పట్టణాలు, నగరాలలో పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. దక్షిణాది నగరాలు, పట్టణాలలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి. అందుకు అనేక కారణాలున్నాయి. కనుక చెత్త నగరాల పోటీ పెడితే కనీసం ఓ వంద నగరాలు నెంబర్:1 స్థానంలో ఉంటాయి.
హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిన మాట వాస్తవం కానీ రోడ్ల పరిస్థితి మాత్రం అప్పుడూ ఎప్పుడూ అచ్చమైన కాంగ్రెస్ నేతలాగే మారకుండా ఒకేలాగ ఉంటోంది. తెరాస సర్కార్ వచ్చిన తరువాత కెసిఆర్, కెటిఆర్ చెప్పిన మాటలు విని నగరంలో ఏదో అద్భుతమైన మార్పులు జరిగిపోబోతున్నాయని నగర ప్రజలు చాలా ఆశ పడ్డారు. కానీ వారిద్దరి మాటలు చేతలలోకి అనువదించలేకపోవడంతో నగరం నేటికీ ఇదే దుస్థితిలో ఉంది. నగరంలో రోడ్ల పరిస్థితి చూస్తుంటే వాటి కోసమే ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖని దానికో మంత్రిని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అనిపిస్తోంది. కనీసం అప్పుడైనా హైదరాబాద్ లో రోడ్లు బాగుపడుతాయేమో?