నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో రాష్ట్ర కాంగ్రెస్ శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవ్వాళ్ళ ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, ఆర్.సి.కుంతియా, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తదితర సీనియర్ నేతలు చాలా మంది హాజరయ్యారు. ఈ మూడు రోజుల కార్యక్రమాలలో పార్టీకి చెందిన జెడ్.పి.టి.సి.లు, ఎం.పి.టి.సి.లు, పి.ఏ.సి కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచులకి, పార్టీ పెద్దలు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
శిక్షణా తరగతులు అంటే పార్టీ విధివిధానాలు, వివిధ అంశాలపై పార్టీ ఆలోచనలు, వ్యూహాలు, పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి జరుగుతాయని అందరూ ఊహిస్తారు. కానీ చాలా వ్యయప్రయాసల కోర్చి నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమం కేవలం అధికార తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ముఖ్యమంత్రి కెసిఆర్ ని తిట్టుకోవడానికే కాంగ్రెస్ నేతలు పరిమితం అవుతున్నారు.
ఈరోజు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి “ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి ఎప్పుడూ ఎన్నికల మీదనే ఉంటుంది. అందుకే పార్టీ ఫిరాయింపులకిచ్చిన ప్రాధాన్యత మరి దేనికీ ఇవ్వరు. అంతకు మించి తెలంగాణాకి ఆయన కొత్తగా చేసిందేమీ లేదు. సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి, మిషన్ కాకతీయలో అవినీతి, మిషన్ భగీరధలో అవినీతి ఇలాగ తెలంగాణా ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనిలోనూ అవినీతి పేరుకుపోతోంది. చివరికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.90,000 కోట్లు ఏమయ్యాయో, దానిని ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవరికీ తెలియదు. తెలంగాణాలో కేవలం కెసిఆర్ కుటుంబ సభ్యులు మాత్రామే చాలా సంతోషంగా ఉన్నారు. నిరంకుశంగా, అవినీతి పాలన చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. తెరాస సర్కార్ పాలనతో విసుగెత్తిపోయున్న రాష్ట్ర ప్రజలే వచ్చే ఎన్నికలలో దానిని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన జానారెడ్డి తదిరులు అందరూ కూడా ఇంచుమించు ఇదే పద్ధతిలో మాట్లాడారు. మొన్న తెలంగాణా విమోచన దినోత్సవం పేరిట హన్మకొండలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో కూడా భాజపా నేతలు తెరాస ప్రభుత్వాన్ని, కెసిఆర్ ని తిట్టిపోసి, వచ్చే ఎన్నికలలో తమపార్టీకే అధికారం కట్టబెట్టాలని కోరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా శిక్షణా కార్యక్రమాలు పేరుతో అదే పని చేస్తోంది. అంటే ఏదో ఒక పేరుతో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకొనే ఈ సభలు, కార్యక్రమాలన్నీ కూడా అధికారం కోసం అవి పడుతున్న తాపత్రయాన్ని చాటి చెప్పుకోవడానికేనని అర్ధం అవుతోంది.
కాంగ్రెస్, భాజపాలే కాదు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మూసపద్దతిలోనే సాగిపోతున్నాయి తప్ప ఆ కార్యక్రమాల అసలు ఉద్దేశ్యం నెరవేరడంలేదని చెప్పక తప్పదు. ఉదాహరణకి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న శిక్షాణా కార్యక్రమం ద్వారా వాటికి హాజరైనవారు ఏమి నేర్చుకొన్నారు? ఈ శిక్షణా కార్యక్రమాల వలన కాంగ్రెస్ పార్టీకేమైనా ఉపయోగపడుతుందా? అంటే ఏమీ లేదనే చెప్పుకోవలసి ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేసుకోలేకపోయినా పార్టీలో ఇంకా ఎంతమంది మిగిలారు? ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమిటనే ఒక అవగాహన నేతలకి ఏర్పడే అవకాశం ఉంది. అదే ఈ శిక్షణా తరగతుల ద్వారా పార్టీకి ఏర్పడే ఏకైక లాభం అని చెప్పుకోవచ్చు.