విమోచనమా..విలీనమా..వితండవాదమా?

ఏపిలో ప్రత్యేకహోదా ఇప్పుడు కేవలం ఒక రాజకీయ అంశంగా, ఆయుధంగా ఏవిధంగా మారిపోయిందో, చాలా సున్నితమైన రాష్ట్ర విమోచన దినోత్సవం కూడా ఇప్పుడు రాష్ట్రంలో అలాగే మారిపోయింది. దానిపై అధికార తెరాస నేతలు, రాష్ట్ర భాజపా నేతలు చేసుకొంటున్న వాగ్వాదాలు చూసి ప్రజల మనసులు చాలా గాయపడుతున్నాయి. 

తెలంగాణా చరిత్ర గురించి ఏ కొద్దిపాటి అవగాహన ఉన్నవారికైనా నిజాం నిరంకుశ పాలన, ఆ సమయంలో రజాకార్ల ఆకృత్యాలు, వాటిని వ్యతిరేకిస్తూ జరిగిన సాయుధపోరాటాల గురించి తెలిసే ఉంటుంది. భారత్ కి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపి వారి చెర నుంచి తెలంగాణాని విడిపించింది. అంటే అది తెలంగాణా విమోచనమే అని అర్ధం అవుతోంది. కానీ చాలా మాటకారితనం గల నిజామాబాద్ ఎంపి కవిత, మరికొంత మంది ఆ పార్టీ నేతలు అది విమోచనం కాదు విలీనం అని తమ వాగ్ధాటితో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా భాజపా ఆరోపించినట్లుగా తాము మజ్లీస్ పార్టీకి భయపడటం లేదని గట్టిగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

వారు దానిలో ఒక చిన్న సాంకేతిక అంశం పట్టుకొని అది విమోచనం కాదు విలీనం అని మాట్లాడుతూ తమ తప్పుని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆనాటి తెలంగాణా ప్రజలు రజాకార్ల చేతిలో ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులని, వాటి నుంచి తెలంగాణాకి విముక్తం కల్పించేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన అమరవీరుల త్యాగాలని గుర్తించడానికి ఇష్టపడటం లేదు. తెలంగాణా ప్రజలకి, అచ్చమైన తెలంగాణావాదులందరికీ ఈ విషయంలో ప్రభుత్వ తీరు చాలా బాధ కలిగిస్తోంది. అదేవిధంగా భాజపా తీరు కూడా ప్రజల మనసులని నొప్పిస్తోంది.

తెలంగాణా విమోచన దినోత్సవ గొప్పదనం గురించి ఆ పార్టీ నేతలు చాలా గొప్పగా, చాలా ఆర్ద్రంగా మనసులు కరిగిపోయేలా మాట్లాడుతున్నప్పటికీ, అంత గొప్ప విషయాన్ని కూడా ఒక మామూలు రాజకీయ అంశంగా మార్చేసి దాని నుంచి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తూ వారు కూడా అమరవీరుల త్యాగాలని కించపరుస్తున్నారని చెప్పకతప్పదు. తెలంగాణాలో వారు అధికారంలోకి రావాలని కలలు కనడం తప్పు కాదు. కానీ అందుకు ఇంకా చాలా రాజకీయ అంశాలున్నాయి. తెలంగాణా ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపి, తమకి అధికారం ఇవ్వమని ప్రజలని కోరవచ్చు. కానీ ఈ చారిత్రాత్మకమైన గొప్ప సంఘటనపై ఈవిధంగా రాజకీయాలు చేయడం, అధికారం కోరుకోవడం రెండూ తప్పే. ఈ విషయంలో తెరాస కూడా తప్పు చేస్తోందని చెప్పక తప్పదు.   

ఒకప్పుడు రాష్ట్రాన్ని ఆంధ్రా పాలకులే పరిపాలించారు కనుక వారు ఓటు బ్యాంక్ రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని వారు తెలంగాణా ఘనచరిత్రని, సాయుధపోరాటాలని, అమరవీరుల త్యాగాలని గుర్తించలేదు. కానీ ఇప్పుడు అచ్చమైన తెలంగాణా పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు కూడా మన తెలంగాణా చరిత్ర గొప్పదనం గుర్తించడానికి నిరాకరిస్తుండటమే కాక తిరిగి ఈవిధంగా వితందవాదన చేస్తుండటం చాలా బాధ కలిగిస్తోంది. భారత స్వాతంత్ర్య పోరాటాలని మనం గుర్తించడానికి నిరాకరిస్తే ఏవిధంగా అనిపిస్తుందో తెలంగాణా విమోచన పోరాటాలని గుర్తించడానికి నిరాకరిస్తే తెలంగాణా ప్రజలకి కూడా అదే విధంగా అనిపిస్తుంది. అయితే మానవులు సూర్యచంద్రుల ఉనికిని గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన్న వాటి గొప్పదనం తగ్గిపోనట్లే రాజకీయ పార్టీలు తెలంగాణా సాయుధ పోరాటాలని గుర్తించనంత మాత్రాన్న వాటి గొప్పదనం కూడా తగ్గిపోదు. కానీ వాటిని కూడా విడిచిపెట్టకుండా రాజకీయ పార్టీలు ఈవిధంగా రాజకీయాలు చేయడమే అందరికీ చాలా బాధ కలిగిస్తోంది. మనం వాటిని గుర్తించడానికి ఇష్టపడనప్పుడు కనీసం వాటి గౌరవానికి భంగం కలిగించకుండా ఉన్నా అదే పదివేలు. 

ఈ విషయంపై తెరాస- భాజపాల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలుగజేసుకోకుండా మౌనం వహించడం కూడా వ్యూహాత్మకమేనని చెప్పవచ్చు. అవి కూడా తమ ఓటు బ్యాంక్ ని కోల్పోతామనే భయంతోనే మౌనం వహిస్తున్నట్లు చెప్పవచ్చు. కానీ ప్రజల మనసులు నోచ్చుకొనే విధంగా మాట్లాడేబదులు మౌనం వహించడమే చాలా మంచిది.

రాష్ట్ర ప్రజలు గర్వంతో చెప్పుకోవలసిన ఆనాటి సాయుధపోరాటాలు, విమోచన దినోత్సవం గురించి నేడు రాజకీయ నేతల నోటి నుండి ఇటువంటి మాటలు వినవలసిరావడం ప్రజల మనసులని చాలా గాయపరుస్తున్నాయి. అయినా వారు అది గుర్తించకుండా వాగ్వాదాలు చేసుకొంటున్నారు.