తెరాస, భాజపాలు వ్యవహరిస్తున్న తీరు నిశితంగా గమనించినట్లయితే అవి ప్రజలని మభ్యపెట్టడానికే ఆవిధంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానం కలుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కగా సహకరించుకొంటూ ఒకదానిని మరొకటి మెచ్చుకొంటుంటాయి. అదే సమయంలో తెరాస, భాజపాలు ఒక దానినొకటి విమర్శించుకొంటూ ఉంటాయి. రాష్ట్రంలో భాజపా అడపాదడపా బహిరంగ సభలు పెట్టి తెరాస ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ని తీవ్రంగా విమర్శించడం, ఆ వెంటనే తెరాస నేతలు మీడియా సమావేశం పెట్టి భాజపాని దానితో బాటు కేంద్రప్రభుత్వాన్ని కూడా ఉతికి జాడించేయడం ఒక ప్రహసనంగా మారిపోయింది.
తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా హన్మకొండలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెరాస ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు చేసి వెళ్ళిపోగానే, యధాప్రకారం తెరాస నేతలు మీడియా సమావేశం పెట్టి ఆయనపై, కేంద్రప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. క్లుప్తంగా దాని సారాంశం ఏమిటంటే, కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని!
ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఆయన పాలనని మెచ్చుకొంటున్నప్పుడు, అమిత్ షా రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే ఎవరు పొరబడుతున్నట్లు? ప్రధాని మోడీనా లేక అమిత్ షానా?
అదేవిధంగా కొన్ని రోజుల క్రితం గజ్వేల్ లో జరిగిన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తమకి అన్నివిధాలా సహకరిస్తోందని, తెలంగాణా రాష్ట్రాభివృద్ధి కోసం రూ.70,000 కోట్లు పైనే ఇచ్చిందని చెప్పుకొని అందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు కూడా తెలుపుకొన్నారు. కానీ ఇప్పుడు తెరాస నేతలు రూ.47,000 కోట్లే ఇచ్చిందని, అది తెలంగాణా ప్రజలు కేంద్రప్రభుత్వానికి చెల్లించిన పన్నుల కంటే కూడా తక్కువేనని, రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నారు. అంటే ఆనాడు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పింది తప్పనుకోవాలా లేక ఇప్పుడు తెరాస నేతలు చెపుతున్నాదే తప్పనుకోవాలా?
తెరాస, భాజపాల ఈ తీరు చూస్తుంటే అవి ప్రజలని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉన్నాయి తప్ప నిజంగా అవి కీచులాడుకొంటున్నట్లు మాత్రం లేదు. భాజపా సభ పెట్టి తెరాసని విమర్శించింది కనుక తెరాస ప్రతి విమర్శలు చేస్తోంది. ఆ తరువాత మళ్ళీ షరా మామూలే. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు భుజాలు రాసుకొని తిరుగుతుంటారు. రాష్ట్రాభివృద్ధికి అది చాలా అవసరమే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్నేహంగా ఉంటూ ఒకదానికొకటి సహకరించుకొంటూ ఉంటే ఎవరూ తప్పు పట్టరు పైగా అందరూ హర్షిస్తారు. కానీ ఈవిధంగా కీచులాడుకొంటున్నట్లు నటిస్తూ ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తేనే ప్రజలు వాటిని ఈసడించుకొంటారు.
ఒకవేళ 2019 ఎన్నికలలో ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలనుకొంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. కానీ దానికి ఇంత దాపరికం అవసరం లేదు. రెండు పార్టీలు ప్రజలని ఈవిధంగా మభ్యపెట్టవలసిన అవసరం అంతకంటే లేదు. ఈవిధంగా ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే చివరికి అవే నష్టపోవచ్చని గ్రహిస్తే మంచిది. ముఖ్యంగా భాజపా ఈ విషయం గ్రహించడం చాలా అవసరం. ఎందుకంటే, తెలంగాణాలో అది మళ్ళీ నిజంగానే బలపడాలనుకొంటే, ఈవిధంగా తెరాస ప్రభుత్వం పట్ల ద్వంద వైఖరి అవలంభిస్తే దాని వలన ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. రాష్ట్ర భాజపా నేతలకి తమ పరిస్థితి ఏమిటో తెలియక అయోమయపడుతుంటారు. చివరికి దాని వలన భాజపాయే నష్టపోతుందని గ్రహిస్తే మంచిది.