స్పష్టత లేని పోరాటం వలన ప్రయోజనం ఏమిటి?

తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా నిన్న హన్మకొండలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆ పార్టీ నేతలు అందరూ ముఖ్యమంత్రి కెసిఆర్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూ ప్రసంగాలు చేశారు. తెరాస ప్రభుత్వం తెలంగాణా విమోచన దినోత్సవం జరుపనందుకే అందరూ కెసిఆర్ ని చాలా తీవ్రంగా విమర్శించారు. కానీ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ ఒక్క విషయానికే పరిమితం కాకుండా సంక్షేమ పధకాలు, ఎన్నికల హామీలని అమలు చేయడంలో కెసిఆర్ వైఫల్యం, అనైతికంగా పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం గురించి కూడా సూటిగా ప్రశ్నించి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో రాష్ట్రంలో భాజపావైపు ప్రజలని ఆకర్షించేవిధంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, ఇస్తున్న నిధులు, వాటి సహాయంతో రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి కూడా మాట్లాడి ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొన్నారు. 

పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలు విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నా కెసిఆర్ సర్కార్ మజ్లీస్ పార్టీకి భయపడి తెలంగాణా విమోచన దినోత్సవం జరుపకపోవడాన్ని అమిత్ షా తప్పు పట్టారు. యావత్ దేశమూ తెలంగాణా స్వాతంత్ర్య పోరాటాలని గుర్తిస్తున్నా కెసిఆర్ సర్కార్ మాత్రం గుర్తించడంలేదని అవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ సగటున ప్రతీ 15 రోజులకి ఒక కొత్త సంక్షేమ పధకం తీసుకువస్తుంటే, కెసిఆర్ సర్కార్ మాత్రం రాష్ట్రంలో సంక్షేమ పధకాలని అమలుచేయడంలో చాలా అశ్రద్ధ చేస్తోందని అమిత్ షా విమర్శించారు. కెసిఆర్ ప్రజల అభిప్రాయాలకి, వారి మనోభావాలకి అనుగుణంగా మెలగాలి కానీ మజ్లీస్ పార్టీ చెప్పినట్లు కాదని అమిత్ షా హితవు పలికారు. ‘కెసిఆర్ అండ్ కంపెనీ’ పాలన నిజాం నవాబు నిరంకుశ పాలనని గుర్తుకు తెస్తోందని, కనుక 2019 ఎన్నికలలో దానిని దింపి భాజపాకి అవకాశం ఇవ్వాలని అమిత్ షా తెలంగాణా ప్రజలని కోరారు.

తెలంగాణా విమోచన దినోత్సవం జరుపనందుకు కెసిఆర్ సర్కార్ ని విమర్శించిన భాజపా నేతలు కూడా ఆ పవిత్రమైన రోజుని తమ పార్టీకి రాజకీయ లబ్ది కలిగించేందుకు నిసిగ్గుగా వాడుకొన్నారు. అమిత్ షాతో సహా భాజపా నేతలు అందరూ తెలంగాణా విమోచన దినోత్సవం గురించే మాట్లాడినా, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలనే కోరికని అందరూ బయటపెట్టుకోవడమే అందుకు నిదర్శనం. విమోచన దినోత్సవం గొప్పదనం గురించి మాట్లాడిన భాజపా నేతలు ఆ పేరుతో ఎన్నికల ప్రచారసభ నిర్వహించుకోవడం తప్పు కాదా? తెరాస సర్కార్ విమోచన దినోత్సవం జరుపకుండా ఏవిధంగా తప్పు చేస్తోందో, భాజపా నేతలు అదే పేరుతో రాజకీయాలు చేసి ఎన్నికల ప్రచారం చేసుకొని అంతే తప్పు చేశారని చెప్పవచ్చు.  

అయినా ఇంతవరకు తెరాసతో ఏవిధంగా వ్యవహరించాలో స్పష్టత లేని భాజపా నేతలు, 2019 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం గురించి కలలుకనడం చాలా విచిత్రంగానే ఉంది. ఆ విషయంలో వారికి స్పష్టత లేనప్పుడు ఎన్ని పోరాటాలు చేసినా ఏమి ప్రయోజనం? భాజపా నేతలు ఆలోచించుకొంటే మంచిది.