తెలంగాణా విమోచన దినోత్సవ సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లా హన్మకొండలో భాజపా బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభలో మాట్లాడిన పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మజ్లీస్ పార్టీపై, తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెరాస ప్రభుత్వం మజ్లీస్ పార్టీకి భయపడి తెలంగాణా విమోచన దినోత్సవం జరపకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తెరాసయే కాకుండా గతంలో సమైక్య రాష్ట్రాన్ని పాలించిన తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మజ్లీస్ పార్టీకి భయపడి తెలంగాణా విమోచన దినోత్సవం జరలేదని, ఇప్పుడు తెరాస కూడా వాటిలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు.
అధికారంలోకి రాకముందు తెలంగాణా ఆత్మగౌరవం అంటూ గర్జించిన కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణా విమోచన దినోత్సవం జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తెస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెరాస సర్కార్ తెలంగాణా విమోచన దినోత్సవం జరుపకుండా తప్పించుకోవడానికి ఇది విమోచనం కాదు విలీనం అని వితండ వాదన చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. భారత్ లో కలిసేందుకు నిరాకరిస్తున్న నిజాం సంస్థానంపై భారత సైన్యం యుద్ధం చేసి ఓడించి దానిని స్వాధీనపరుచుకొంటే అది విమోచనం అవుతుందే తప్ప విలీనం ఎలాగా అవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మజ్లీస్ పార్టీ హైదరాబాద్ లో ఉగ్రవాదులని తయారుచేస్తూ, ప్రోత్సహిస్తూ, వారికి అండగా నిలుస్తూ దేశానికి చాలా ప్రమాదకరంగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు. మజ్లీస్ నేతలని మంచి చేసుకోవడానికే కెసిఆర్ తెలంగాణా విమోచన దినోత్సవం చేయడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణా విమోచన దినోత్సవం జరుపడానికి ఇష్టపడని తెరాస సర్కార్ ని దింపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. భాజపాకి ప్రజలు అవకాశం కల్పించి అధికారం ఇచ్చినట్లయితే తాము తప్పకుండా తెలంగాణా విమోచన దినోత్సవం జరుపుతామని కిషన్ రెడ్డి అన్నారు.
ఈ సభలో మాట్లాడిన మిగిలిన వక్తలు అందరూ కూడా ఇదే పాయింట్ చుట్టూ తమ ప్రసంగాలు అల్లుకొని మాట్లాడారు. ఒకవిధంగా చూస్తే వారు సందర్బోచితంగానే మాట్లాడారని చెప్పవచ్చు. కానీ అంతకు మించి ఏమీ మాట్లాడకపోవడంతో ఒక మంచి అవకాశాన్ని వృధా చేసుకొన్నారని చెప్పక తప్పదు. తెలంగాణా విమోచన దినోత్సవం జరుపనందుకే తెరాసని గద్దె దింపాలని, అది జరుపడానికే భాజపాకి ప్రజలు పట్టం కట్టాలని కోరుకోవడం చాలా అత్యాశే అవుతుంది.
మజ్లీస్ పార్టీకి భయపడి, ముస్లిం ఓట్ల కోసమే తెరాస సర్కార్ తెలంగాణా విమోచన దినోత్సవం జరపడం లేదని వాదించిన భాజపా నేతలు, జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాదులకి బహిరంగంగానే మద్దతు ఇస్తున్న పిడిపితో కలిసి భాజపా సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తోందనే సంగతి మరిచిపోయారనుకోవాలా?
ఒకప్పుడు భాజపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాశ్మీర్ లో లాల్ చౌక్ వద్ద మువ్వన్నెల జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు చాలా హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరూ అటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. ఎందుకు?అనే ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసు.
ఏమైనప్పటికీ తెరాస సర్కార్ అధికారికంగా తెలంగాణా విమోచన దినోత్సవం జరిపి ఉంటే ప్రజలలో దాని గౌరవం మరింత పెరిగేదే తప్ప తగ్గేది కాదు. తెలంగాణా విమోచన దినోత్సవం జరపడం వలన ముస్లిం ఓట్లు కోల్పోతామనుకోవడం కేవలం అపోహ మాత్రమే. అదే నిజమైతే మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విమోచన దినోత్సవం జరిపేవి కావు కదా? కానీ జరుపుతున్నాయంటే విమోచన దినోత్సవానికి, ఓటు బ్యాంక్ కి ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం అవుతోంది కదా? మరి అటువంటప్పుడు తెలంగాణా విమోచన దినోత్సవం జరుపుకోవడానికి తెరాస సర్కార్ మాత్రం ఎందుకు భయపడాలి?