తెరాస సర్కార్ పై రేవంత్ రెడ్డి మళ్ళీ ఫైర్ అయ్యారు. ఈసారి నయీం వ్యవహారంలో తెరాస సర్కార్ వైఖరిని ఆయన తప్పు పట్టారు. నయీం డైరీలో తెదేపా నేతల పేర్లున్నాయని మీడియాకి లీకులు ఇస్తూ, తమని బెదిరింఛి భయపెట్టాలని తెరాస సర్కార్ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నయీం డైరీ పేరు చెప్పి తమను బెదిరిస్తే సహించబోమని గట్టిగా హెచ్చరించారు. నయీం డైరీ దొరికినట్లు మీడియాలో వార్తలు (లీకులు) వస్తున్నాయి తప్ప ఆ విషయాన్ని ఆ కేసుని దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఎవరూ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలని బెదిరించి లొంగదీసుకోనేందుకే తెరాస సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈవిధంగా మీడియాకి లీకులు ఇస్తోందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కనుక ఒకవేళ నిజంగానే నయీం డైరీ దొరికి ఉంటే దానిలో ఎవరెవరి పేర్లున్నాయో అధికారికంగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి తెరాస సర్కార్ కి సవాల్ విసిరారు.
ఇదివరకు ఓటుకి నోటు కేసులో ఏసిబి అధికారులు స్టింగ్ ఆపరేషన్ పూర్తి చేసిన కొద్ది నిమిషాలకే ఆ వివరాలు, ఆ ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. రాష్ట్రంలో తెదేపాని దాని బలమైన నాయకుడుగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసేందుకే తెరాస సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కుట్ర పన్నిందని అప్పుడు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఏసిబికి తప్ప మరొకరికి తెలియకూడని అత్యంత రహస్యమైన ఆ వివరాలన్నీ టీవీ చానళ్ళకి అందజేయడమే అందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు వాదించారు. ఆ తరువాత కూడా కొందరు మంత్రులు ఆ కేసుకి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని గొప్పగా చెప్పుకోవడంతో తెదేపా వాదనలని దృవీకరించినట్లయింది.
ఇప్పుడు నయీం డైరీ విషయంలో కూడా మళ్ళీ అదేవిధంగా జరుగుతున్నట్లు రేవంత్ రెడ్డి మాటలని బట్టి అర్ధం అవుతోంది. నయీం డైరీ దొరికినట్లు సిట్ అధికారులు అధికారికంగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ అందులో తమ పేర్లున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో రాష్ట్రానికి చెందిన ఒక తెదేపా మాజీ మంత్రి, మాజీ డిజిపి మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించవలసి వచ్చింది.
తాజాగా తెదేపా ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిలకి నయీంతో సంబంధాలున్నాయంటూ మీడియాలో వార్తలు రావడంపై వారు కూడా తెరాస సర్కార్ పై మండిపడ్డారు. తెరాస సర్కార్ రాజకీయంగా తమని దెబ్బ తీయడానికే మీడియాకి ఇటువంటి లీకులు ఇస్తున్నట్లు వారు కూడా అభిప్రాయపడ్డారు. తెరాస సర్కార్ కి ధైర్యం ఉంటే నయీం కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పగించాలని వారు కూడా సవాలు విసిరారు.
ఒకప్పుడు ఓటుకి నోటు కేసుని తెరాస సర్కార్ తన రాజకీయ ప్రత్యర్దులని దెబ్బతీసేందుకు ఏవిధంగా వాడుకొందో ఇప్పుడు ఈ నయీం కేసుని కూడా అదేవిధంగా వాడుకొంటున్నట్లు ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సిట్ అధికారులకి మాత్రమే తెలిసిన ఆ వివరాలు మీడియాలో కనబడుతుండటమే వారి అనుమానాలకి కారణం. మరి తెరాస సర్కార్ వారి ప్రశ్నలకి, సవాళ్ళకి ఏవిధంగా జవాబిస్తుందో చూడాలి.