ఏపి సిఎం నయీం కంటే దారుణమట!!!

ఇటీవల ఎన్కౌంటర్ చేయబడిన కరడుగట్టిన క్రిమినల్ నయీం కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దారుణమైన పనులు చేయిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా సంచలమైన ఆరోపణలు చేశారు. అందుకోసం ఆయన తన ముఖ్యమంత్రి పదవిని ముసుగుగా వాడుకొంటున్నారని ఆమె అన్నారు. ఓటుకి నోటు కేసులో నుంచి బయటపడేందుకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కాళ్ళపై పడి ప్రత్యేక హోదాని పణంగా పెట్టి ఆ కేసు నుంచి బయటపడ్డారని ఆమె ఆరోపించారు. తాను నిప్పునని ఎన్నడూ ఎటువంటి తప్పులు చేయలేదని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు 18 కేసులలో కోర్టుల నుంచి స్టే తెచ్చుకొన్నారని రోజా విమర్శించారు.

ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం చాలా సహజమే కానీ ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఎవరూ ఊహించలేరు. అయితే ఆమెకి ఆ అవకాశం కల్పించింది చంద్రబాబేనని చెప్పక తప్పదు. విజయవాడలో బయటపడిన కాల్-మనీ కేసుల్లో కొంతమంది తెదేపా నేతల పేర్లు వినపడిన సంగతి తెలుసు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన ఇసుక మాఫియా వ్యవహారానికి అడ్డు పడినందుకు వనజాక్షి అనే ఒక మహిళా తహసిల్దార్ పై చెయ్యి చేసుకోవడం అందరికీ తెలిసిందే. మంత్రి నారాయణ కాలేజిలో విద్యార్ధిని ఆత్మహత్య కేసు, రాజధాని ప్రాంతంలో తెదేపా నేతల బినామీ భూముల వ్యవహారం, సదావర్తి భూముల కుంభకోణం...ఇలాగ చెప్పుకొంటూపోతే ఒక చిన్న పుస్తకమే అచ్చు వేయించవలసి వస్తుంది. అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి “ఎంపరర్ ఆఫ్ కరప్షన్” అనే పుస్తకాన్ని అచ్చేయించి డిల్లీలో అందరికీ పంచిపెట్టారు.       

చంద్రబాబు ఓటుకి నోటు కేసు నుంచి తెలివిగా బయటపడగలిగినప్పటికీ నేటికీ దాని గురించి ఆయన ధైర్యంగా మాట్లాడలేరు. అందుకే రోజా లాంటి వాళ్ళు కూడా దాని గురించి ఆయనపై విమర్శలు చేయగలుగుతున్నారు. ఆ కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా సాక్ష్యాధారాలు కనబడుతున్నప్పటికీ తాను నిప్పునని ఎటువంటి తప్పులు చేయలేదని, పులిలాంటి వాడినని ఎవరికీ భయపడనని బుకాయిస్తుంటారు. అది చూసి ప్రజలు కూడా నవ్వుకొంటుంటారు. ఆ కేసు నుంచి బయటపడేందుకే ఆయన ఏపికి ప్రత్యేక హోదాని కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని ఆంధ్రాలో ప్రజలు అనుకొంటున్న మాటనే రోజా చెప్పారనుకోవచ్చు.

చంద్రబాబు స్టే తెచ్చుకోవడాన్ని రోజా ఆక్షేపించడంతో అందరూ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు, జైలు, బెయిల్ గురించి ఆలోచించేలా చేశారు. జగన్ జైలుకి వెళ్ళడం, బెయిల్ సంపాదించుకొని బయటపడటం తప్పుకానప్పుడు చంద్రబాబు కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకొంటే తప్పేలా అవుతుంది? అయినా ఏ ముఖ్యమంత్రి తన పదవికి గండం ఏర్పడుతుందంటే చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోరు కదా? ఓటుకి నోటు కేసుని ఆయన ఎదుర్కోవలసివస్తే ఆయన తన పదవిని కోల్పోవడమే కాదు...పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బతింటాయి. ఆ కారణంగా తెదేపా ప్రభుత్వమే కుప్పకూలిపోవచ్చు. అటువంటి పరిస్థితి రావాలని ఎవరూ కోరుకోరు. అందుకే ఓటుకి నోటు కేసులో చంద్రబాబు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొన్నారు. ఆయన పరిస్థితిలో మరెవరున్నా అదే పని చేస్తారు. ఏమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశ్యించి రోజా అంత అనుచితమైన పదాలు వాడటం సరి కాదు.