భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రేపు రాష్ట్రానికి వస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆగస్ట్ 9 నుంచి కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న తిరంగా (మువ్వన్నెల జెండా) యాత్ర ముగింపు సందర్భంగా రేపు వరంగల్ లో భాజపా బారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దానికి హాజరయ్యేందుకే అమిత్ షా వస్తున్నారు. ఆయన రేపు మధ్యాహ్నం డిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ చేరుకొని సభకి హాజరవుతారు. సభ ముగియగానే మళ్ళీ హైదరాబాద్ చేరుకొని రాత్రి అక్కడే ఒక హోటల్లో బస చేస్తారు. అప్పుడు రాష్ట్ర భాజపా నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం ఆయన డిల్లీ తిరిగి వెళ్ళిపోతారు.
ఈ తిరంగా యాత్ర కేవలం ప్రజలలో జాతీయభావం ప్రజ్వలింపజేసేందుకే తప్ప దీనిలో భాజపాకి ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. కానీ తెలంగాణా ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణా విమోచన దినోత్సవాణ్ని అధికారికంగా జరుపాలని రాష్ట్ర భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మజ్లీస్ పార్టీతో స్నేహానికే ప్రాధాన్యత ఇస్తునందునే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని చేయడానికి ఇష్టపడటం లేదని భాజపాతో సహా ప్రతిపక్ష పార్టీ నేతలు అందరూ విమర్శిస్తూనే ఉన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించకపోయినా తాము నిర్వహిస్తామని చెపుతున్నాయి. అందుకే భాజపా బహిరంగ సభకి ఆ రోజుని ఎంచుకొని ఉండవచ్చు.
ఈ సభకి కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు హాజరయ్యే అవకాశం ఉంది. వారితో బాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్ర నేతలు హాజరవుతారు. కిషన్ రెడ్డి ఫేవరేట్ టాపిక్-తెరాస, మజ్లీస్ సంబంధాలని విమర్శించడం. కనుక ఆ సభలో ఆయనతో సహా రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణా విమోచన దినోత్సవం గురించి మాట్లాడినప్పుడు తప్పకుండా తెరాస-మజ్లీస్ సంబంధాల గురించి కూడా మాట్లాడి తెరాస సర్కార్ పై విమర్శలు చేయక మానరు.
భాజపా ఏ ఉద్దేశ్యంతో ఈ సభని నిర్వహిస్తున్నా, దాని అంతిమ లక్ష్యం రాష్ట్రంలో ప్రజలని ఆకట్టుకొని పార్టీని బలోపేతం చేసుకోవడమేనని చెప్పవచ్చు. ప్రజలలో జాతీయభావం పెంపొందించేందుకే దేశ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వం ఈ తిరంగా యాత్రలు నిర్వహిస్తున్న సమయంలోనే కావేరీ జలాల పంపకాల కోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు శత్రుదేశాల కంటే హీనంగా ఒకరి ఆస్తులు మరొకరు తగులబెట్టుకోవడం చాలా దురదృష్టకరమే. అంటే కేంద్రప్రభుత్వం తిరంగా యాత్ర ఉద్దేశ్యం నెరవేరనే లేదనిపిస్తోంది.