మాజీ కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి హయంలో తమ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించేవారు. అందుకు కారణం ఆయన రాష్ట్ర విభజనని అంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించడమే. తెలంగాణా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత పొన్నం మాట్లాడటం చాలా తగ్గించారు. కానీ ఇప్పటికీ నోరువిప్పి మాట్లాడితే బాంబులు పేల్చినట్లే ఉంటాయి ఆయన మాటలు. ఈసారి ఆయన తెలంగాణా ఎన్జీవో నేతల మీద బాంబులు కురిపించారు.
ఒకప్పుడు వారందరూ కాంగ్రెస్ మంత్రుల్ని, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేవారని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ని నిలదీయాలంటే లాగులు తడుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడవలసిన ఎన్జీవో నేతలు, ముఖ్యమంత్రి కెసిఆర్ కి తొత్తులుగా మారుతున్నారని విమర్శించారు. అటువంటప్పుడు వారు తమ ఉద్యోగ సంఘాలని తెరాసలో విలీనం చేసేస్తే బాగుంటుందని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై వీరపోరాటాలు చేసేసిన ఎన్జీవో నేతలు దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
పొన్నం ప్రశ్నలలోనే సమాధానాలు కూడా కనబడుతున్నాయి. ఒకప్పుడు ఆయన ఏవిధంగా ఏ కారణంతో తమ స్వంత ప్రభుత్వంపైనే పోరాడేవారో, అప్పుడు వారు కూడా అదే కారణం చేత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేవారు. అప్పుడు తెలంగాణాకి చెందిన నేతలు కూడా మంత్రులుగా ఉన్నప్పటికీ వారిపై ఆంధ్రా పాలకులే పెత్తనం చేసేవారు. తెలంగాణా మంత్రులు తమ పదవులు అధికారం కోసం తెలంగాణా ఉద్యమాలకి సహకరించకపోవడం వలన వారిని ఉద్యోగ సంఘాలు నిలదీస్తుండేవి. కానీ ఇప్పుడు తెలంగాణా ఉద్యమాలు జరుగడం లేదు. పైగా తెలంగాణా సాధించిన తెరాస పార్టీయే ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఆ కోణం నుంచి ఉద్యోగులు దానితో ఇక పోరాటం చేయవలసిన అవసరంలేదు. తెలంగాణా ఏర్పడిన తరువాత జీతాల పెంపుకోసం ఉద్యోగులు పోరాడినప్పుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ వారు ఆశించిన దానికంటే కాస్త ఎక్కువే ఇచ్చారు. అటువంటప్పుడు ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాడవలసిన అవసరం ఏమిటి?
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాల పట్ల కొంచెం కటువుగా వ్యవహరిస్తున్న మాట వాస్తవమే. దానికి వారు నిరంకుశ పాలన అని పేరు పెట్టుకొన్నారు. కానీ ఉద్యోగుల పట్ల ఆయన నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్లు ఇంతవరకు ఎటువంటి పిర్యాదులు రాలేదు. ఒకవేళ తెరాస సర్కార్ వలన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే అప్పుడు వారే తప్పకుండా ప్రశ్నిస్తారు కదా? ఏ కారణం లేకుండానే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరితో వ్యవహరించాలన్నట్లుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడటాన్ని ఎవరూ హర్షించ(లే)రు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండి ఉంటే ఆయన ఉద్యోగులకి ఈవిధమైన సలహా ఇవ్వగలరా? ఒకవేళ ఉద్యోగులు ఆయనని ప్రశ్నిస్తే సహించగలరా? ఆలోచించుకొంటే మంచిది.