నయీం కేసు దర్యాప్తులో నిత్యం ఏదో ఒక కొత్త విషయం లేదా ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతూనే ఉండటం విశేషం. వైకాపా ఆలోచనలకి, వ్యూహాలకి అద్దం పట్టే సాక్షి మీడియా ఈరోజు ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర సంచలనమైన ఆరోపణలు చేస్తూ ఒక వార్త ప్రచురించింది.
నయీం కేసుని దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం ముఖ్యమంత్రి కెసిఆర్ కి సమర్పించిన ఒక మధ్యంతర నివేదికలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21మంది పోలీస్ అధికారుల పేర్లున్నాయని పేర్కొంది. వారిలో చాలా మంది ఒకప్పుడు చంద్రబాబు హయాంలో పనిచేసినవారే. కనుక ఈ కేసు నుంచి తమని బయటపడేయమని వారు ఆయనని వేడుకొన్నట్లు విశ్వసనీయమైన సమాచారం ఉందని సాక్షి పేర్కొంది. వారిని బయట పడేసేందుకు చంద్రబాబు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడి ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సాక్షి పేర్కొంది. సాక్షి చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవే. అది కేవలం చంద్రబాబుపైనే ఆరోపణలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నా, ఈ కేసులో నిందితులని రక్షించడానికి కేంద్ర హోంమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అందరూ ప్రయత్నించబోతున్నారని ఆరోపిస్తున్నట్లుగానే చూడవలసి ఉంటుంది.
నయీంతో కొందరు తెరాస నేతలకి కూడా సంబంధాలున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిన తరువాతనే ముఖ్యమంత్రి కెసిఆర్ సిట్ బృందంలో మరి కొందరు ఉన్నతాధికారులని కూడా చేర్చి మరింత లోతుగా దర్యాప్తు జరిపిస్తున్నారు. అంటే తన సొంత పార్టీ నేతలని కూడా ఉపేక్షించడానికి ఆయన ఇష్టడటం లేదని అర్ధం అవుతూనే ఉంది. మరి అటువంటప్పుడు ఆయన చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళకి తలొగ్గుతారా? అంటే అనుమానమే.
అయినా కేసుపై దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి అండగా నిలుస్తున్న మీడియా ఇటువంటి ఆరోపణలు చేయడం సరి కాదు. దాని వలన దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రజలలో కూడా అపనమ్మకం కలిగిస్తుంది. కనుక ఆ ఆరోపణలని నిరూపించుకోవలసిన బాధ్యత కూడా సాక్షి మీడియాపైనే ఉంటుంది.