కావేరి జలాల పంపకాలపై కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో రగిలిన చిచ్చు క్రమంగా చల్లారుతోంది, కానీ ఆ రెండు రాష్ట్రాలు అందుకు చాలా భారీ మూల్యం చెల్లించాయి. ముఖ్యంగా భారతదేశానికి ఐటి రాజధాని అని చెప్పుకోదగ్గ బెంగుళూరు నగరంలో గత నాలుగైదు రోజులలో జరిగిన అల్లర్లు, విధ్వంసం వలన ఐటి, పారిశ్రామిక రంగాలకి సుమారు రూ.25,000 కోట్లు నష్టం జరిగి ఉండవచ్చని అసోచాం అంచనా వేసింది. ఇక తమిళనాడులో ఎంత నష్టం జరిగిందో...రెండు రాష్ట్రాలలో తగులబడిన వాహనాలు, ప్రజల, ప్రభుత్వ ఆస్తులు విలువ ఎంత ఎంటుందో ఇంకా లెక్కలు తేలవలసి ఉంది.
ఈ గొడవలు, విధ్వంసం చూసి కృష్ణా, గోదావరి జలాల కోసం గొడవలు పడుతున్న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కొని, రెండు తెలుగు రాష్ట్రాలలో అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా చర్చలకి సిద్ధం అయ్యాయని తెలిస్తే సంతోషించని వారుండరు. నదీ జలాల పంపకాలపై సామరస్యంగా చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. వీలైతే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రమంత్రి సమక్షంలోనే చర్చించుకొని సమస్యని పరిష్కరించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల దసరా పండుగ తరువాత అందరికీ అనువుగా ఉన్న సమయంలో ఈ సమావేశం జరగవచ్చని తెలుస్తోంది.
కర్నాటక, మహారాష్ట్రలతో ఏవిధంగా నదీ జలాల పంపకాల గురించి చర్చించుకొని సామరస్యంగా సమస్యలని పరిష్కరించుకొంటున్నామో, ఆంధ్రప్రదేశ్ తో కూడా అదే విధంగా చర్చించుకొని ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆఫ్ ద రికార్డ్ చెప్పినట్లు తెలుస్తోంది. గోదావరి నదిలో రెండు రాష్ట్రాలు అవసరమైన నీళ్ళను వాడుకొన్నా ఇంకా సుమారు 2000 టి.ఎం.సి.ల నీళ్ళు వృధాగా సముద్రంలో కలిసిపోతుంటాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చాలాసార్లు అన్నారు. కనుక గోదావరి జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించుకొనే అవకాశం కనబడుతోంది. కానీ తగినంత నీటి లభ్యత లేని కారణంగా కృష్ణానదీ జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడం కొంచెం కష్టమే.