రోహిత్ వేముల-నేటికీ రాజకీయాస్త్రమే

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అధికారుల వేధింపులకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్న రోహిత్ వేముల, కొందరికి రాజకీయ ఆయుధం, మరికొందరికి చర్చలకి పనికివచ్చే అంశం, ఇంకొందరికి కులసమీకరణ లెక్కలలో భాగం. ఈ విధంగా అతను చనిపోయిన తరువాత కూడా జీవిస్తూనే ఉన్నాడు. నేటికీ చాలా మందిని ఆదుకొంటూనే ఉన్నాడు.

సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ పిసిసి ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో రోహిత్ పై ఒక సదస్సు నిర్వహించారు. దానిలో ప్రొఫెసర్ కోదండరాం, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, విమలక్క, ఏపీ కాంగ్రెస్ నుంచి వినయ్‌కుమార్, శారద తదీతరులు పాల్గొని మాట్లాడారు.

వారు రోహిత్ మరణాన్ని రకరకాల కోణాలలో విశ్లేషిస్తూ మాట్లాడారు. యూనివర్సిటీలలో దళిత, బలహీన వర్గాల విద్యార్ధుల పట్ల వివక్ష, అప్రజాస్వామిక విధానాలు వగైరాలు రోహిత్ మృతికి కారణం అని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారుల వేధింపులకి, వివక్షకి, నిర్లక్ష్యానికి  బలైపోయిన రోహిత్ వేములని యూనివర్సిటీ హత్య చేసినట్లుగానే భావించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అతను మరణించినప్పుడు దేశం నలుమూలల నుంచి ఎంతో మంది వచ్చి సంతాపం తెలిపి, అతని తల్లిని ఓదార్చి వెళ్ళినప్పటికీ నగరంలోనే ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కి తీరిక దొరకలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రోహిత్ చట్టాన్ని రూపొందించి దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని అన్నారు. అప్పుడే దళితులకి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెరాస సర్కార్ పాలనలో రాయడానికి, గొంతెత్తి పాడుకోవడానికి కూడా స్వేచ్చ లేదని విమలక్క అన్నారు.

రోహిత్ ఆత్మహత్య చేసుకొన్న తరువాత రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ తో దేశం నలుమూలల నుంచి సహా చాలా మంది నేతలే యూనివర్సిటీకి వచ్చి ప్రసంగాలు చేసి అతని తల్లిని ఓదార్చి వెళ్ళారు. ఆ తరువాత మళ్ళీ యూనివర్సిటీ మొహం చూసింది లేదు. అక్కడి విద్యార్ధుల సమస్యలని పట్టించుకొన్నదీ లేదు.

అప్పుడు చాలా రోజుల వరకు అతని మృతికి దారి తీసిన కారణాలపై మీడియాలో చాలా లోతైన చర్చలు జరిగాయి. ఆ తరువాత అతని కులం గురించి చర్చలు సాగాయి. అతను దళితుడేనని కొందరు, కాదని మరికొందరు వాదించుకొన్నారు. మరణించిన ఒక వ్యక్తి కులం గురించి అందరికీ అంత శ్రద్ధ ఎందుకు అంటే అతని కులాన్ని రాజకీయంగా వాడుకొనేందుకేనని చెప్పక తప్పదు. అతను దళితుడు కనుకనే అంతమంది వచ్చారు తప్ప ఉజ్వల భవిష్యత్ ఉన్న ఒక మేధావిని కోల్పోయామనే బాధతో కాదు. యావత్ దేశాన్ని కదిలించిన ఆ సంఘటన తరువాతైనా మళ్ళీ ఏ యూనివర్సిటీలలో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొన్న దాఖలాలు కూడా లేవు.

అందరూ కలిసి రోహిత్ ని ఒక చర్చనీయమైన అంశంగా మార్చేసి ఇటువంటి సదస్సులు, సమావేశాలు పెట్టుకొని రకరకాల అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నేటికీ రోహిత్ కి న్యాయం జరిగిందా? అందుకు బాధ్యులైన వారు శిక్షించబడ్డారా? యూనివర్సిటీలలో పరిస్థితులలో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా? అని ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎవరికీ ఆ ఆసక్తి, తీరిక కూడా లేవు.