సంకల్పం బలంగా ఉంటే దేవుడు కూడా కరుణిస్తాడంటారు పెద్దలు. తెరాస సర్కార్ విషయంలో అది మరొకమారు ఋజువయింది. సరైన సాగునీటి సౌకర్యం లేని రాష్ట్రంలో కాకతీయుల కాలం నాటి నుంచి ఉన్న చెరువులని పునరుద్ధరించుకొన్నట్లయితే పంటలకి నీళ్ళు అందించవచ్చనే ఆలోచనే అద్భుతం. అదేం అద్భుతం? అని అనుకోవచ్చు. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళముందు ఎండిపోయిన చెరువులని పట్టించుకొన్న దాఖలాలు లేవు. అవి కబ్జాలకి గురవుతుంటే చూస్తూ ఊరుకొన్నాయే తప్ప వాటిని పునరుద్ధరించుకొంటే అందరికీ మేలు కలుగుటుందని ఊహించలేకపోయాయి. కనుక ఆ ఆలోచనే అద్భుతం అని చెప్పక తప్పదు. ఆ క్రెడిట్ ముఖ్యమంత్రి కెసిఆర్ కి, ఆయన ప్రభుత్వానికే దక్కుతుంది.
వ్యవసాయంపై మక్కువ గల కెసిఆర్ తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి కావడం రైతుల అదృష్టమేనని చెప్పక తప్పదు. ఆయన మానస పుత్రికే మిషన్ కాకతీయ. దానిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నా కెసిఆర్ వెనుకంజ వేయకుండా ధైర్యంగా తను అనుకొన్నది సాధిస్తున్నారు. ఆయన పట్టుదల, కృషిని చూసి పైనున్న ఆ భగవంతుడు కూడా ఖుష్ అయిపోయినట్లున్నాడు. అందుకే మిషన్ కాకతీయ పధకం ద్వారా 8 జిల్లాలలో పునరుద్ధరించబడిన 2,133 చెరువులని తన అమృత ధారలతో నింపేశాడు.
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ మండలంలో పునరుద్ధరించబడిన డ్యాంగా పూర్ చెరువు, దానికి అనుబంధంగా ఉన్న ఖజానా చెరువు, ఖురాన్ పేటలో రెండు చెరువులు, గొల్లపేట, ఇబ్రహీం సాగర్, వెంకటాపూర్, కంచరోని, చించోలి మొదలైన చెరువులు నిండు కుండల్లా కళకళలాడుతుంటే అవి చూసి గ్రామస్తుల మొహాలు కళకళలాడుతున్నాయి. మళ్ళీ అనేక ఏళ్ళ తరువాత ఆ చెరువులలో నీటిని చూశామని వృద్ధులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ కారణంగా ఆ చెరువుల సమీప ప్రాంతాలలో బోరు బావులలో, నూతులలో భూగర్భ జలాలు పెరిగినట్లు ప్రజలే చెపుతున్నారు. ఖరీఫ్, రబీ రెండు దశల పంటలకి సరిపడే నీళ్ళని ఈ చెరువులు అందించగలవని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ళలో రాష్ట్రంలో 46,531 చెరువులని మిషన్ కాకతీయ పధకం కింద పునరుద్ధరించాలని కంకణం కట్టుకొంది. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం సఫలం అయితే తెలంగాణలో సాగునీటి సమస్య చాలా వరకు తీరిపోతుంది. వీటికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తయినట్లయితే తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారుతుంది.