సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచేసి తెరాస ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తోందని, కోర్టుని కూడా తప్పు దారి పట్టిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెరాస ప్రభుత్వంపై వారు గవర్నర్ నరసింహన్ కి ఫిర్యాదు చేశారు. నేడో రేపో రాష్ట్రపతిని కలిసి ఆయనకీ పిర్యాదు చేయబోతున్నారు. ఆ తరువాత మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నట్లు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందరూ మూకుమ్మడిగా చేస్తున్న ఈ విమర్శలు, పోరాటాల కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావడమే కాకుండా, తెలంగాణ కి మేలు చేకూర్చే పనులే చేస్తున్నప్పటికీ దానిపై ప్రజలలో అనుమానాలు, అపోహలు పెరుగుతున్నట్లు గుర్తించింది. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లుగా సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలకి ఆ పార్టీ నుంచి తెరాసలోకి వచ్చిన నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి చేత సమాధానం చెప్పించింది.
“కాంగ్రెస్ నేతలకి సాగునీటి ప్రాజెక్టులు గురించి అసలు ఏమాత్రం అవగాహనే లేదు. అయినా నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడేస్తున్నారు. తాము ప్రాజెక్టులకి వ్యతిరేకం కాదని చెపుతూనే మళ్ళీ వాటికి అడుగడుగునా అడ్డు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి, నిర్వాసిత రైతులకి మేలు చేసేందుకు కృషి చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాపై బురద జల్లుతున్నారు. అమాయకులైన రైతులకి కల్లబొల్లి కబుర్లు చెప్పి వారిని తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. వారి వలెనే రాష్ట్రంలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. సమైక్య రాష్ట్రంలో వారు పదవులకి ఆశపడి ఆంధ్రా పాలకులకి తొత్తులుగా మారి తెలంగాణ కి తీరని అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా ఇంకా అన్యాయం చేస్తూనే ఉన్నారు,” అని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
నేటికీ కాంగ్రెస్ ఎంపిగానే కొనసాగుతున్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తన మీద తనే ఉమ్ముకొన్నట్లుంది. కాంగ్రెస్ పార్టీని ఆయన ఎంతగా విమర్శిస్తే అంతగా తనపై తానే ఉమ్ముకొన్నట్లవుతుంది. తెరాసలో చేరిన మిగిలిన కాంగ్రెస్ నేతలు ఈ విషయం గ్రహించబట్టే మౌనం వహిస్తున్నారు. కాంగ్రెస్ నేతలకి సాగునీటి ప్రాజెక్టులు గురించి అవగాహన లేదు..ఆంధ్రా పాలకులకి తొత్తులు వంటి మాటలన్నీ ఆయనకీ వర్తిస్తాయని మరిచిపోయి విమర్శలు గుప్పిస్తే కాంగ్రెస్ నేతలు కూడా అంతకంటే ఘాటుగా ఆయనకీ జవాబీయగలరు.