మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణని వ్యతిరేకిస్తూ వేముల ఘాట్ లో గత మూడు నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నిర్వాసితులని కలిసేందుకు ప్రతిపక్షాలని తెరాస సర్కార్ అనుమతించకపోవడంతో, నిర్వాసితులకి సంఘీభావం తెలిపేందుకు వారు మొన్న ఇందిరా పార్క్ లో ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెదేపా, కాంగ్రెస్, వైకాపా, వామ పక్షాల నేతలు పాల్గొన్నారు. బద్ధ శత్రువులమని చెప్పుకొంటూ తెదేపా, కాంగ్రెస్ నేతలు కలిసి పోరాటాలు చేస్తుండటాన్ని తెరాస ఎద్దేవా చేసింది.
దానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమాధానం ఇస్తూ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి సంఘీభావం తెలిపేందుకే అన్ని పార్టీలు కలిసి ధర్నా చేశాయి. అంత మాత్రాన మేము తెదేపాతో స్నేహం చేస్తున్నట్లు అనుకోవడం సరికాదు. నిజానికి తెరాసయే తెదేపాతో ఓటుకి నోటు కేసులో కుమ్మక్కు అయ్యి ఆ కేసుని అటకెక్కించేసిందని అందరికీ తెలుసు. పోలవరం కోసం తెలంగాణలో ఏడు మండలాలని ఆంధ్రాకి ధారాదత్తం చేసినప్పుడు కెసిఆర్ మాట్లాడలేదు. పైగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులని సమర్ధిస్తూ మాట్లాడారు. దానిని బట్టి ఎవరు తెదేపాతో చేతులు కలిపారో అర్ధం అవుతోంది,” అని జవాబిచ్చారు.
అయితే తెరాస ఆరోపణలో వాస్తవం లేకపోలేదు. తెరాస ధాటిని తట్టుకోలేకనే రాష్ట్రంలో ప్రతిపక్షాలు అవసరమైనపుడు తమ రాజకీయ విభేదాలు పక్కనబెట్టి చేతులు కలుపుతున్న మాట వాస్తవం. ఇప్పుడూ అదే చేశాయి. ఒకవేళ ప్రతిపక్షాలు ఇదే విధంగా కలిసి పనిచేయడానికి అలవాటుపడితే, వచ్చే ఎన్నికలలో అన్ని పార్టీలు కలిసి తెరాసని దెబ్బ తీసే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే అవన్నీ వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలలో, గ్రేటర్ ఎన్నికలలో పరస్పరం సహకరించుకొన్నాయి. ఇక ముందు కూడా సహకరించుకొనే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
తెరాస సృష్టించిన అభద్రతా భావం, తెరాస పట్ల శత్రుత్వమే వాటిని దగ్గరకి చేరుస్తోందనే సంగతి తెరాస గుర్తించే ఉంటుంది. తెరాస పూర్తి ప్రజాస్వామిక విధానాలకి కట్టుబడి ఉండి ఉంటే ప్రతిపక్షాల మధ్య ఇటువంటి రాజకీయ ఐక్యత ఏర్పడి ఉండేదే కాదు కదా!